ఇరాన్‌లో అధికార మార్పిడి బాధ్యతలు తీసుకుంటున్నా
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:47 AM
ఖమేనీ మృతితో ఇరాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ శకం ముగిసి, ప్రజాస్వామ్యం వైపు అడుగులు పడతాయని ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావీ పేర్కొన్నారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ శకం ముగిసింది
ప్రజాస్వామ్యంవైపు అడుగులు పడతాయి
ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావీ వ్యాఖ్య
వాషింగ్టన్, మార్చి 1: ఖమేనీ మృతితో ఇరాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ శకం ముగిసి, ప్రజాస్వామ్యం వైపు అడుగులు పడతాయని ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావీ పేర్కొన్నారు. ఇరాన్‌లో అధికార మార్పిడి విషయంలో తాను బాధ్యత తీసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన నాయకత్వం లేకపోతే ఇరాన్ కుప్పకూలిపోతుందని రెజా పహ్లావీ అన్నారు. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఇరాన్‌గా రూపుదిద్దుకునేందుకు దేశంలోని మిలటరీ, న్యాయ, భద్రతా శక్తులన్నీ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇరాన్ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకుని, ప్రపంచ దేశాల పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత ఎన్నికలకు వెళ్లాలని.. ఇందుకోసం దేశంలో రెఫరెండం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఎన్నికల అనంతరం కొత్త, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి ముందు రాజు మహమ్మద్ రెజా పహ్లావీ పాలనలో కొనసాగేది. 1979లో విప్లవకారులు రాచరికాన్ని గద్దె దింపి ఇస్లామిక్ రిపబ్లిక్‌ను స్థాపించారు. తండ్రితో కలిసి రెజా పహ్లావీ అమెరికాలో ప్రవాసంలో ఉంటున్నారు. ఇటీవల ఇరాన్‌లో ఆందోళనలు జరిగినప్పుడు.. ఖమేనీ తప్పుకోవాలంటూ, రెజా పహ్లావీ ఇరాన్‌కు రావాలంటూ నినాదాలు నినాదాలు వినిపించడం గమనార్హం.