రఫేల్ తయారీ భారత్‌లోనే..
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:22 AM
దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. భారత వాయుసేన కోసం తలపెట్టిన రూ.3.25 లక్షల కోట్ల మెగా రఫేల్ డీల్‌లో భాగంగా అందించాల్సిన 114 యుద్ధ విమానాల్లో..
114 రఫేల్స్‌లో 94 జెట్లు స్థానికంగా ఉత్పత్తి
సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫ్రాన్స్ ప్రతిపాదన
దేశీయ రక్షణ తయారీ రంగానికి ఊతం
న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. భారత వాయుసేన కోసం తలపెట్టిన రూ.3.25 లక్షల కోట్ల మెగా రఫేల్ డీల్‌లో భాగంగా అందించాల్సిన 114 యుద్ధ విమానాల్లో 94 జెట్లను భారత్‌లో తయారు చేసేందుకు ఫ్రాన్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ అధికారిక ప్రతిపాదన సమర్పించింది. ఇది కార్యరూపం దాలిస్తే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాలు తయారవడం ఇదే తొలిసారి కానుంది. భారత్ ఈ ఏడాది మే నెలలో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ (ఎల్‌వోఆర్)ను ఫ్రాన్స్‌కు పంపింది. దానికి ప్రతిస్పందనగా ఆ దేశం తాజాగా ఈ పూర్తిస్థాయి ప్రతిపాదనను భారత్‌కు సమర్పించింది. దీనిలో భారత్‌లో తయారీ, సాంకేతికత బదిలీ, స్వదేశీ ఆయుధాల అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ, వాయుసేనకు చెందిన అక్విజిషన్ విభాగం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తున్నాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, ఫ్రాన్స్ ప్రతిపాదనల్లో ముఖ్యమైనది తాను అందించాల్సిన 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 94 జెట్లను భారత్‌లోనే స్థానిక సంస్థల భాగస్వామ్యంతో తయారు చేయడం. ఈ కార్యక్రమంలో దసో ఏవియేషన్‌తోపాటు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థలైన ఎంబీడీఏ, సాఫ్రాన్, థేల్స్ కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఈ ప్రాజెక్టు భారత ఏరోస్పేస్ రంగానికి గొప్ప ఊపునిస్తుందని.. టాటా, ఎల్ అండ్ టీ వంటి భారతీయ కంపెనీలు, ఇతర దేశీయ రక్షణ రంగ సంస్థలకు అపారమైన అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద పరిశ్రమల భాగస్వామ్యంతో సుమారు రూ.1.6 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని అంచనా. మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసే రఫేల్ ప్లాట్‌ఫామ్‌లో స్వదేశీ ఆయుధ వ్యవస్థలను.. ముఖ్యంగా అస్త్ర మిస్సైల్ రకాలను అనుంధానించే నిబంధనలపై ఫ్రాన్స్ చేసిన ప్రతిపాదనను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
వాయుసేనకు రఫేల్ చాలా కీలకం..
భారత్ ఇప్పటికే పాతబడిన మిగ్ యుద్ధ విమానాలను దశల వారీగా ఉపసంహరించుకుంటోంది. అలాగే తేలికపాటి యుద్ధ విమానాలైన ఎల్‌సీఏ ఎంకే1ఏ, త్వరలో అందుబాటులోకి రానున్న ఎల్‌సీఏ ఎంకే2 వంటి స్వదేశీ విమానాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా స్క్వాడ్రన్ బలం తగ్గుతోంది. ఈ లోటును అత్యాధునిక రఫేల్స్‌తో భర్తీ చేయాలనేది భారత్ లక్ష్యం. ఈ క్రమంలో 2024లో చేసిన 114 రఫేల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ సేకరణ మండలి... 5నెలల క్రితం ఆమోదం తెలిపింది. భారత వాయుసేన, నౌకాదళం కోసం ఇప్పటికే 62 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇచ్చారు. ప్రతిపాదిత 114 రఫేల్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. భారత్ వద్ద ఉండే రఫేల్స్ సంఖ్య 176కి పెరుగుతుంది. అలాగే భారత నౌకాదళం కూడా తన విమాన వాహక యుద్ధ నౌకల కోసం 31 రఫేల్-ఎం రకం యుద్ధ విమానాలు కావాలని కోరింది.