ఖతార్ గ్యాస్ కేంద్రంలో పేలుడు.. 12 మంది భారతీయుల మృతి
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:24 AM
ఖతార్‌లోని రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కీలకమైన ఓ సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతి కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదాన్ని నింపింది.
66 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
దుబాయి/దోహా జూన్ 22: ఖతార్‌లోని రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కీలకమైన ఓ సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతి కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. అందులో 12 మంది భారతీయులేనని దోహాలోని భారతీయ రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. మృతుల్లో ఒకరు పాకిస్థాన్ పౌరుడిగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 66 మంది గాయపడ్డారని, మరో 18 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతిచెందిన భారతీయులకు సంతాపం తెలుపుతూ భారత ఎంబసీ ‘ఎక్స్’లో ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడిన వైద్య చికిత్స అందుతోందని తెలిపింది. బాధిత భారతీయ కుటుంబాలకు అవసరమై సహాయాన్ని అందించేందుకు ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను వీలైనంత త్వరగా భారత్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ పేలుడు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పేలుడుతో ఎటువంటి గ్యాస్ లీజేజీలు కాలేదని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా మార్చిలో ఈ ప్లాంట్ మూతపడింది. శాంతి చర్చల నేపథ్యంలో ఎగుమతులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.