బ్రిటన్ రాజు తమ్ముడు ఆండ్రూ అరెస్టు
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:41 AM
బ్రిటన్ రాజు చార్లెస్-3 తమ్ముడు, మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు దేశ రహస్యాలకు సంబంధించిన పత్రాలు అక్రమంగా......
ఎప్‌స్టీన్‌కు రహస్య పత్రాలు చేరవేసిన కేసులో..
66వ పుట్టిన రోజు నాడే అరెస్టు చేసిన పోలీసులు
అరెస్టుపై అధికారిక ప్రకటనలో లేని ఆండ్రూ పేరు
చట్టం తనపని తాను చేసుకుపోతుంది: చార్లెస్
ఆండ్రూ రాజలాంఛనాలు గత ఏడాదే రద్దు
అమెరికా జైల్లో ఉన్నది ఎప్‌స్టీన్ స్నేహితురాలు మాక్స్‌వెల్ కాదని ప్రచారం
ఓ బాలికతో ఆండ్రూ మౌంట్‌బాటన్ (ఫైల్)
లండన్, ఫిబ్రవరి 19: బ్రిటన్ రాజు చార్లెస్-3 తమ్ముడు, మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు దేశ రహస్యాలకు సంబంధించిన పత్రాలు అక్రమంగా చేరవేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై థేమ్స్‌వ్యాలీ పోలీసులు ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. గురువారమే ఆండ్రూ 66వ పుట్టినరోజు. ఆండ్రూను అరెస్టు చేసినప్పటికీ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరును ప్రస్తావించలేదు. ‘అధికార దుర్వినియోగం కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. ఆ వ్యక్తి పేరును బయటపెట్టకూడదని ప్రభుత్వం ఆదేశించింది’అని థేమ్స్‌వ్యాలీ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ ఒలీవర్ రైట్ తెలిపారు. ప్రస్తుతం ఆండ్రూ నివాసం ఉంటున్న తూర్పు ఇంగ్లండ్‌లోని సాండ్రింఘమ్ ఎస్టేట్‌లోకి గురువారం ఆరు పోలీసు వాహనాలు వెళ్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. బెర్క్‌షైర్, నార్‌ఫోక్‌లలో ఆండ్రూకు చెందిన నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఒలీవర్ రైట్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో ఆండ్రూ చాలాకాలంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎప్‌స్టీన్‌కు చెందిన దీవిలో బాలికలను ఆండ్రూ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. వాటిని ఆయన ఎప్పటికప్పుడు ఖం డిస్తూ వచ్చారు. ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్‌కు చెందిన 30 లక్షల పత్రాల్లో ఆండ్రూకు చెందినవి కూడా ఉన్నాయి. బాలికలతో అభ్యంతరకంగా ఉన్న ఫొటోలు కూడా బయటకు రావటంతో ఆయ న నేరాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బ్రిటన్ ప్రజల నుంచి డిమాండ్లు పెరిగాయి. దీంతో ఆండ్రూపై దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని రాజకుటుంబం ఈ నెల ప్రా రంభంలో ప్రకటన విడుదల చేసింది. అయితే, లైంగిక వేధింపులపై కాకుండా ప్రస్తుతం అధికార దుర్వినియోగం ఆరోపణలపైనే దర్యాప్తు ప్రారంభమైనట్లు థేమ్స్‌వ్యాలీ పోలీసులు ప్రకటించారు. గతకొన్ని దశాబ్దాల్లో బ్రిటన్ రాజకుటుంబంలోని ఓ సీనియర్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయటం ఇదే తొలిసారి.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది: రాజు చార్లెస్
ఆండ్రూ అరెస్టుపై బ్రిటన్ రాజు చార్లెస్-3 స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. వ్యక్తులకంటే వ్యవ స్థే ఉన్నతమైనదని, అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఆండ్రూ దేశ వాణిజ్య రాయబారిగా పనిచేసిన సమయంలో పాల్పడిన అవకతవకలపై ప్రధాని స్పందిస్తూ.. ‘ఆండ్రూ అయినా, మరో వ్యక్తి అయినా చట్టం ముందు అందరూ సమానమే. మనం ఇప్పుడు ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ, ఇంకా లెక్కకు మిక్కిలి కేసులు ఉన్నాయి’ అని తెలిపారు.
రాజదర్పం నుంచి పాతాళంలోకి..
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2కు ప్రస్తుత రాజు చార్లెస్ మొదటి కుమారుడు కాగా, ఆండ్రూ రెండో కుమారుడు. ఆయనకు వంశపారంపర్యంగా యువరాజుగా, యార్క్ ప్రభువు (డ్యూక్)గా అధికార హోదా దక్కాయి. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్నేహం, బాలికలను లైంగికంగా వేధించటం, ఆ మోజులో పడి దేశ రహస్య పత్రాలను ఎప్‌స్టీన్‌కు లీక్‌చేయటం వంటి అనేక నేరాలకు ఆండ్రూ పాల్పడ్డారు. 1960 ఫిబ్రవరి 19న పుట్టిన ఆండ్రూ.. బ్రిటీష్ రా యల్ నేవీలో 22 సంవత్సరాలు సేవలందించారు. వివిధ ఆరోపణలు, విమర్శల నేపథ్యం లో గతఏడాది నవంబరు 3న ఆండ్రూకు ఉన్న యువరాజు, డ్యూక్ ఆఫ్ యార్క్ బిరుదులను రద్దుచేయటంతోపాటు రాజకుటుంబ సభ్యుడి హోదాను రద్దు చేస్తూ రాజు చార్లెస్ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆండ్రూ సాధారణ జీవితం గడుపుతున్నారు.
జైల్లో ఉన్నది మాక్స్‌వెల్ కాదా?
జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైల్లో ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనను ఎవరో హత్యచేశారని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయన స్నేహితురాలు ఘిస్లైన్ మాక్స్‌వెల్ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎప్‌స్టీన్ కేసుపై విచారణ జరుపుతున్న అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు జైల్లో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాక్స్‌వెల్ ఇటీవల హాజరయ్యారు. ఆ వీడియో బయటకు రావటంతో.. అందులో ఉన్నది మాక్స్‌వెల్ కాదనే వాదనలు మొదలయ్యాయి.
