ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌లో ఘనస్వాగతం
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:09 AM
రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఇజ్రాయెల్ వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. టెల్ అవీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న...
టెల్ అవీవ్, ఫిబ్రవరి 25: రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఇజ్రాయెల్ వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. టెల్ అవీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్ గురియన్ విమానాశ్రయంలో దిగిన మోదీకి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. మోదీని నెతన్యాహు ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తన సతీమణి సారా ధరించిన వస్త్రాలతో మోదీ కోటు జేబులో ఉన్న రుమాలు రంగు సరిపోలిందని నెతన్యాహు అనగా.. అది ‘కాషాయ’ రంగు అని మోదీ నవ్వుతూ చెప్పారు. గురువారం ఇద్దరు ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ మీడియా అమిత ప్రాధాన్యం ఇచ్చింది. జెరూసలేం పోస్ట్ పత్రిక బుధవారం నాటి సంచిక మొదటి పేజీలో మోదీ అభివాదం చేస్తున్న ఫొటోను ముద్రించి..‘వెల్‌కమ్.. మోదీ’ అని హెడింగ్ పెట్టింది. హిందీలో ‘నమస్తే’ అని క్యాప్షన్ ఇచ్చింది.