గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యం
ABN , Publish Date - May 20 , 2026 | 02:28 AM
భవిష్యత్తులో కీలకం కానున్న గ్రీన్ టెక్నాలజీ, సృజనాత్మక ఆవిష్కరణల అంశంలో నార్డిక్ దేశాలు, భారత్ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
నార్డిక్ దేశాల అధినేతలు, ప్రధాని మోదీ భేటీలో నిర్ణయం
ఓస్లో, మే 19: భవిష్యత్తులో కీలకం కానున్న గ్రీన్ టెక్నాలజీ, సృజనాత్మక ఆవిష్కరణల అంశంలో నార్డిక్ దేశాలు, భారత్ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా పర్యావరణహిత ఇంధనం, సుస్థిర అభివృద్ధి, సృజనాత్మక ఆవిష్కరణలు, సరికొత్త సాంకేతికతలు కేంద్రంగా సహకరించుకోవాలని అవగాహనకు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం నార్వేలోని ఓస్లోలో జరిగిన భారత్-నార్డిక్ దేశాల మూడో శిఖరాగ్ర సదస్సు అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉత్తర యూరప్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సాంస్కృతికంగా సారూప్యమున్న డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్ దేశాలను నార్డిక్ దేశాలుగా వ్యవహరిస్తారు. ఇంతకుముందు 2018, 2022లో నార్డిక్-భారత్ సదస్సులు జరిగాయి. తాజాగా ఓస్లోలో జరిగిన మూడో సదస్సులో ఐస్‌ల్యాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్ ప్రధానులు క్రిస్ట్రన్ ఫ్రోస్టడోటిర్, పెట్టెరి ఓర్పో, మెట్ ఫ్రెడరిక్సన్, జోనాస్ గర్హ్, ఉల్ఫ్ క్రిస్టెర్సన్, భారత ప్రధాని మోదీ పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయంగా నియమాల ఆధారంగా వ్యవస్థలు కొనసాగే విధంగా భారత్, నార్డిక్ దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా సంఘర్షణలకు త్వరిత పరిష్కారం, శాంతి ప్రయత్నాల కోసం మద్దతు ఇస్తామని చెప్పారు. గత పదేళ్లలో నార్డిక్ దేశాల నుంచి భారత్‌కు పెట్టుబడులు 200శాతం పెరిగాయని.. ఇది అటు భారత్‌కు, అటు నార్డిక్ దేశాల ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడిందన్నారు. నార్వే, ఐస్‌ల్యాండ్‌లతో వాణిజ్యఒప్పందాలు కుదుర్చుకోబోతున్నామని తెలిపారు.
నార్డిక్, హిందీ.. అచ్చమైన ‘సంబంధం’!
నార్డిక్ దేశాలు, భారత్ వేర్వేరు భాషలు మాట్లాడుతున్నా.. వీటి మధ్య సహజ సంబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హిందీలోని ‘సంబంధ్’ అనే పదానికి బంధం, అనుబంధం అని అర్థమని.. నార్డిక్ భాషల్లోనూ ‘సంబంద్’ అనే పదానికి ఇవే అర్థాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇది పదాల మధ్య పోలిక మాత్రమేకాదని.. నార్డిక్ దేశాలు, భారత్ మధ్య అనుబంధానికి గుర్తు అని వ్యాఖ్యానించారు.