అవకాశాల గని.. భారత్
ABN , Publish Date - May 19 , 2026 | 04:19 AM
పునర్వినియోగ ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, టెక్నాలజీ, వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులకు భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
భారత్- నార్వే బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ
ఓస్లో, మే 18: పునర్వినియోగ ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, టెక్నాలజీ, వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులకు భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. పెట్టుబడులతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నార్వే పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నాలుగు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని.. సోమవారం స్వీడన్ నుంచి నార్వే చేరుకున్నారు. ఓస్లోలో ఇండియా-నార్వే బిజినెస్ అండ్ రీసెర్చ్ సమ్మిట్‌లో నార్వే ప్రధాని జోనాస్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, షిప్పింగ్, శుద్ధ ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అంతకుముందు ఆయన నార్వే ప్రధాని జోనా్‌సతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ రంగాల్లో ఎంవోయూ కుదిరినట్లు నార్వే ప్రధాని వెల్లడించారు. ఉక్రెయిన్- రష్యా, పశ్చిమాసియా ఘర్షణలకు వెంటనే ముగింపు పలకాలని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం ఓస్లోలో నిర్వహించే మూడో ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొంటారు. ఈ సమావేశంలో నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్ దేశాల ప్రధానులు కూడా పాల్గొంటారు. ప్రధాని మోదీకి నార్వే తన అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇదిలా ఉండగా, నార్వేలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పకుండా వెళ్లడంపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘ప్రధాని మీడియా ప్రశ్నలకు భయపడి పారిపోతే ప్రపంచం ముందు భారత్ పరువు ఏంకావాలి’’ అని ప్రశ్నించారు.