Share News

హోర్ముజ్‌ స్వేచ్ఛగా, భద్రంగా ఉండాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:04 AM

హోర్ముజ్‌ జలసంధి స్వేచ్ఛగా, భద్రమైన రవాణాకు వీలు కల్పించేలా ఉండాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నొక్కిచెప్పారు.

హోర్ముజ్‌ స్వేచ్ఛగా, భద్రంగా ఉండాలి

  • ఫోన్‌ చర్చల్లో ప్రధాని మోదీ, ట్రంప్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: హోర్ముజ్‌ జలసంధి స్వేచ్ఛగా, భద్రమైన రవాణాకు వీలు కల్పించేలా ఉండాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నొక్కిచెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణ తక్షణ అవసరమని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్‌ జలసంధి, భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపై చర్చించారు. ఇరాన్‌-అమెరికా చర్చలు విఫలమవడం, హోర్ముజ్‌ను అమెరికా దిగ్బంధించడం నేపథ్యంలో ట్రంప్‌, మోదీ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ చర్చల అనంతరం భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ వివరాలు వెల్లడించారు. త్వరలోనే భారత్‌-అమెరికా మధ్య ఇంధన రంగం సహా పలు అంశాలపై భారీ ఒప్పందాలు కుదరనున్నాయని, అవి చాలా ముఖ్యమైనవని తెలిపారు. అయితే ఆ ఒప్పందాల వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. జలసంధి మూసివేతతో ఇరాన్‌ మొత్తం ప్రపంచాన్ని బందీ చేసిందని, ఆ జలసంధిని తెరవడానికి అమెరికా ప్రయత్నం చేస్తోందని తెలిపారు. అది భారత్‌ సహా ప్రపంచం మొత్తానికి ప్రయోజనం కలిగిస్తుందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే నెలలో భారత్‌లో పర్యటించి, కీలక అంశాలపై చర్చలు జరుపుతారన్నారు. ఇక ట్రంప్‌ తన ఫోన్‌ కాల్‌ చివరిలో ‘‘మీకో విషయం చెప్పాలి. మీరంటే మా అందరికీ ఎంతో ఇష్టం’’ అని మోదీకి చెప్పారని సెర్గియో గోర్‌ వెల్లడించారు. ‘‘మిత్రుడు ట్రంప్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. వివిధ అంశాల్లో భాగస్వామ్యం, సంబంధాల బలోపేతంపై సమీక్షించాం. పశ్చిమాసియాలో పరిస్థితిపై.. హోర్ముజ్‌ను తెరిచి, భద్రంగా ఉంచాల్సిన అవసరంపై చర్చించాం’’ అని మోదీ ఎక్స్‌లో తెలిపారు.

Updated Date - Apr 15 , 2026 | 04:04 AM