Share News

కంట్లో మొలిచిన మొక్క!

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:21 AM

‘కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని..’! ఓ సినీకవి చెప్పిన ఈ మాట బాధాతప్తమైన మనసుకు ఎంత భరోసా కలిస్తుందో కదా! మరి.. ఆ నేత్రమే విత్తనానికి క్షేత్రమై..

కంట్లో మొలిచిన మొక్క!

  • రష్యా వాసి స్లెప్‌స్టోవ్‌కు భయానక అనుభవం

  • తలకు చెట్టు కొమ్మ తగిలి కంట్లో పడ్డ విత్తనం

  • మొక్క మొలిచి 3 మి.మీ. మేర పెరిగిన వైనం

  • 4 నెలలుగా తలనొప్పి.. మందగించిన చూపు

  • కంట్లోంచి మొక్కను తొలగించిన వైద్యులు

న్యూఢిల్లీ, నవంబరు 1: ‘కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని..’! ఓ సినీకవి చెప్పిన ఈ మాట బాధాతప్తమైన మనసుకు ఎంత భరోసా కలిస్తుందో కదా! మరి.. ఆ నేత్రమే విత్తనానికి క్షేత్రమై.. కన్నీటి చెమ్మే ఆ విత్తనాన్ని వేళ్లూనుకునేలా చేస్తే? మొత్తంగా కంట్లోనే ఓ మొలక మొలిస్తే? మనిషికి అదెంత నరకప్రాయమో ఊహించండి! రష్యాకు చెందిన 42 ఏళ్ల మ్యాగ్సిమ్‌ స్లెప్‌స్టొవ్‌ అనే వ్యక్తికి ఈ భయానక అనుభవం ఎదురైంది. స్లెప్‌స్టోవ్‌ ఓ ప్లంబర్‌. నాలుగు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడతను. కన్ను బాగా వాచిపోయింది. చూపు మసకబారిపోయింది. నేత్రవైద్యుడిని సంప్రదిస్తే.. ‘‘నీ కంట్లో ఓ విత్తనం వేళ్లూనుకొని మొక్క మొలిచిందోయి’’ అని చెప్పేసరికి స్లెప్‌స్టొవ్‌ నోరెళ్లబెట్టాడు! ఇక్కడి నుంచి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. గత జనవరిలో స్లెప్‌స్టోవ్‌ ఓ చిట్టడవిలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ చెట్టు కొమ్మ అతడి ముఖానికి తగిలింది. కంట్లో ఏదో పడ్డట్టు అనిపించడంతో సహజంగానే కంటిని చేత్తో నలుపుకొన్నాడు! కొద్దిసేపటికి ఆ కన్ను ఎర్రగా మారినా దానికదే తగ్గిపోయింది. అయితే నాలుగు నెలల క్రితం అతడికి తలనొప్పి మొదలైంది. రానురాను ఆ తలనొప్పి భరించలేని విధంగా తయారైంది.


నేత్రవైద్యుల వద్దకెళితే వారు పరీక్షించి ఆశ్చర్యపోయారు. అసలేమైందంటే.. అప్పట్లో కొమ్మకు స్లెప్‌స్టోవ్‌ తల తగిలినప్పుడు చిన్న విత్తనమొకటి అతడి కంట్లో పడింది. పైగా కంట్లోని తెల్లటి భాగాన్ని కప్పి ఉంచే ‘కజుంక్టివా’ అనే పారదర్శకమైన పలుచటి పొరలోకి 3 మిల్లీమీటర్ల మేర వెళ్లిపోయింది. ఆ విత్తనానికి వేరు పుట్టింది.. ఆ వేరు కంటిపొర కణజాలంలోకి చొచ్చుకుపోయింది. అది మొలకెత్తి 3 మిల్లీమీటర్ల మేర పాకింది. కంటి భాగంలో మత్తుమందిచ్చి..సూది సాయంతో కంట్లోంచి ఆ విత్తనాన్ని తొలగించారు. ‘‘నేత్ర వైద్యురాలిగా నా వృత్తిలో ఎన్నడూ ఇలాంటి ఘటనను చూడలేదు’’ అని శస్త్రచికిత్స చేసిన ఎలిజవెటా కార్పొవా అనే వైద్యురాలు పేర్కొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 02:23 AM