Share News

పాక్‌లో రైలుపై ఆత్మాహుతి దాడి 30 మంది మృతి

ABN , Publish Date - May 25 , 2026 | 03:50 AM

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో రైలుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతిచెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది..

పాక్‌లో రైలుపై ఆత్మాహుతి దాడి 30 మంది మృతి

  • తామే చేశామని ప్రకటించుకున్న బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ

ఇస్లామాబాద్‌, మే 24: పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో రైలుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతిచెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది సైనికులే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనకు తమదే బాధ్యత అని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మాజీద్‌ బ్రిగేడ్‌ ప్రకటించుకుంది. క్వెట్టాలోని చమన్‌ పట్టక్‌ సిగ్నల్‌ వద్ద రైలును పేలుడు పదార్థాలున్న వాహనంతో ఢీ కొట్టారు. పేలుడు ధాటికి మంటలు చెలరేగడంతో పాటు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. క్వెట్టా మిలిటరీ కంటోన్మెంట్‌కు చెందిన సైనికులు, వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండటంతో బీఎల్‌ఏ లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. దాడి సమయంలో రైలులో 300మందికి పైగా పాక్‌ సైనికులున్నారు. సైనికులే లక్ష్యంగా రైలుపై జరిగిన దాడి పిరికి పందల చర్య అని పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ విమర్శించారు. క్వెట్టా-పెషావర్‌ మధ్య నడిచే జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను ఉగ్రవాదులు గతంలోనూ అనేక సార్లు లక్ష్యం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఈ దాడులు మరింత పెరిగాయి. 2025 మార్చి 11న ఉగ్రవాదులు బొలాన్‌ ప్రాంతంలో జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను హైజాక్‌ చేశారు. 350 మంది ప్రయాణికులను, సైనికులను బందీలుగా చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు జరిపిన దాడుల్లో 33 మంది ఉగ్రవాదులు, 30 మంది ప్రయాణికులు, సైనికులు మృతిచెందారు.

Updated Date - May 25 , 2026 | 03:50 AM