Share News

పాక్‌లో ‘సింధ్‌’ సెగలు

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:10 AM

పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంత విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా సింధీలు కరాచీని ముట్టడించారు. సంప్రదాయ టోపీలు, మేలి ముసుగులు ధరించిన వేలాది మంది సింధీ యువతీయువకులు..

పాక్‌లో ‘సింధ్‌’ సెగలు

  • ప్రావిన్స్‌ విభజన ప్రతిపాదనకు నిరసనగా కరాచీ ముట్టడి

ఇస్లామాబాద్‌, నవంబరు 24 : పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంత విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా సింధీలు కరాచీని ముట్టడించారు. సంప్రదాయ టోపీలు, మేలి ముసుగులు ధరించిన వేలాది మంది సింధీ యువతీయువకులు ఎర్ర జెండాలు చేత పట్టుకుని రోడ్డెక్కారు. సింధ్‌ను ముక్కలు చేసే కుట్రలను సహించబోమంటూ మిలిటరీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ను నేరుగా హెచ్చరిస్తూ, భారీ ప్రదర్శన నిర్వహించారు. సింధ్‌ రాజకీయ పార్టీలు, సంస్థలతో ఏర్పడిన ఐక్య సంఘటన కమిటీ (జై సింధ్‌ రహబార్‌ కమిటీ) నాయకత్వంలో కరాచీ సహా పంజాబ్‌ ప్రావిన్సీ పరిధిలోని చాలాప్రాంతాల్లో ఆదివారం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరుగునపడిన సింధూదేశ్‌ డిమాండ్‌ను జాతీయవాదులు తిరిగి తెరపైకి తెచ్చారు. ఈ ఆందోళనలకు మూలం ఏంటంటే.. పాకిస్థాన్‌లో మరిన్ని ప్రావిన్సీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్సీలను 15కు విస్తరించాలని ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా సింధ్‌ను కూడా విడగొట్టనున్నట్టు ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ మద్దతుదారు, మంత్రి మొహసిన్‌ నఖ్వీ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఆ నిర్ణయాన్ని ప్రధాన జాతీయవాద సంస్థ జై సింధ్‌ ముత్తహిదమహజ్‌(జేఎ్‌సఎమ్‌ఎమ్‌) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే కీలకమైన పంజాబ్‌ ప్రావిన్సీలో ఆర్థిక దిగ్బంధనానికి పిలుపునిస్తామని హెచ్చరించింది. సింధ్‌ను కేవలం ఒక ప్రాంతంగా చూడరాదని...విశిష్ఠ భాష, సంస్కృతి, నాగరికత, సంప్రదాయాలను కలిగిన సింధీలకు ఉన్న ఏకైక మాతృభూమి ఇదేనని తెలిపింది. షెహబాజ్‌ షరీఫ్‌ సర్కారులో కీలక భాగస్వామి అయిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) కూడా సింధ్‌ విభజనను వ్యతిరేకిస్తోంది.

Updated Date - Nov 25 , 2026 | 04:12 AM