Share News

పాక్‌లో అమెరికా కాన్సులేట్‌ ముట్టడి

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:10 AM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతికి నిరసనగా పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్‌ ముట్టడికి నిరసనకారులు ప్రయత్నించారు. రాళ్లు, కర్రలతో...

పాక్‌లో అమెరికా కాన్సులేట్‌ ముట్టడి

  • పోలీసుల కాల్పుల్లో పది మంది మృతి

  • ప్రధాన నగరాల్లో వెల్లువెత్తిన నిరసనలు

  • ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ అమలు

కరాచీ, మార్చి 1: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతికి నిరసనగా పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్‌ ముట్టడికి నిరసనకారులు ప్రయత్నించారు. రాళ్లు, కర్రలతో వందలాది మంది విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో పదిమంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు. నిరసనకారులు పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితిని అదుపు చేయడానికి టియర్‌ గ్యాస్‌, రబ్బర్‌ బుల్లెట్లను ఉపయోగించాల్సి వచ్చిందని సీనియర్‌ పోలీసు అధికారి ఎస్‌ఎ్‌సపీ ఆసద్‌ రెజా వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిరసనల నేపథ్యంలో కాన్సులేట్‌కు వెళ్లే అన్ని దారులను మూసేశారు. నిరసనకారులపై కాన్సులేట్‌కు కాపలా ఉన్న అమెరికా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారన్న వార్తలను పాక్‌ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు ఇస్లామాబాద్‌, లాహోర్‌ల్లోనూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ విధించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులకు వ్యతిరేకంగా లాహోర్‌లోని ప్రెస్‌ క్లబ్‌ వద్ద నిరసనలు చేపట్టారు. లాహోర్‌, ఇస్లామాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కరాచీ, లహార్‌, పెషావర్‌ల్లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళనలను, అలాగే ఇస్లామాబాద్‌లోని యూఎస్‌ ఎంబసీ వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ తెలిపింది.

చెన్నైలోనూ ముట్టడికి యత్నం

ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ హత్య, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా చెన్నైలో ఆదివారం పలు ముస్లిం సంస్థలు తీవ్ర నిరసన తెలిపాయి. ఈ నిరసనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు స్థానిక అన్నాసాలైలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అయితే పోలీసులు.. నిరసనకారులను స్థానిక రాయపేటలోనే అడ్డుకుని శాంతింపజేశారు.

Updated Date - Mar 02 , 2026 | 01:10 AM