భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. వీధుల్లో పాక్ ప్రజల నిరసనలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 02:04 PM
పాక్‌లో నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు భారంగా మారడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. వేల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇటీవల పెట్రోల్‌పై విధించిన లెవీని పాక్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లో నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు భారంగా మారడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. వేల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇటీవల పెట్రోల్‌పై విధించిన లెవీని పాక్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జమాత్ ఏ ఇస్లామీ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జాతీయ రహదారులు, రోడ్లపై ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కరాచీ, లాహోర్, పెషావర్, కెట్టా, ఇస్లామాబాద్ వంటి నగరాల్లో ప్రజాగ్రహం మిన్నంటింది. పెట్రోల్‌పై విధించిన లెవీని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను విధానాలపై జమాత్ ఏ ఇస్లామీ చీఫ్ నయీముర్ రెహ్మాన్ మండిపడ్డారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు, ఇతర కేబినెట్ మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘ఈ ప్రభుత్వం, అంతుకుముందున్న ప్రభుత్వం.. ఇలా అందరూ ఈ పరిస్థితికి బాధ్యులు. ఈ లెవీని అస్సలు ఒప్పుకోము. ప్రధాని, కేబినెట్ మంత్రులూ.. నేను చెప్పేది గుర్తుంచుకోండి. మీరు వెనక్కు తగ్గాల్సిందే. లేవీని తొలగించాల్సిందే’ అని తేల్చి చెప్పారు.
ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్న పాక్ ప్రస్తుతం ఐఎమ్ఎఫ్ ఇచ్చిన అప్పులతో నెట్టుకొస్తోంది. రుణాలు ఇచ్చినందుకు ప్రతిగా పొదుపు చర్యలు చేపట్టాలని, పన్నులు పెంచాలని, ప్రైవెటీకరణను ప్రోత్సహించాలని ఐఎమ్ఎఫ్ అనేక షరతులు విధించింది. ఈ నేపథ్యంలో లెవీ తొలగింపునకు ఐఎమ్ఎఫ్ ఒప్పుకోదని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను జమాత్ చీఫ్ తోసిపుచ్చారు. ‘ఐఎమ్ఎఫ్ లేదు ఏమీ లేదు.. మీరు పేద విద్యార్థులను అణచివేస్తున్నారు. లెవీకి అంగీకరించేదే లేదు’ అని స్పష్టం చేశారు. శుక్రవారం నాటి నిరసన ప్రదర్శనలన్నీ ట్రైలర్ మాత్రమేనని, అసలు నిరసనలు ముందున్నాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రులు, గవర్నర్‌ల ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
మార్చి నెల నుంచీ దాదాపు ప్రతివారం పెట్రోల్ ధరలను పాక్ ప్రభుత్వం పెంచుతూ వెళుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు ఆకాశాన్నంటడంతో పొదుపు చర్యలు పాటిస్తూనే పెట్రోల్ ధరలనూ పెంచుతోంది. ఈ నేపథ్యంలో పాక్‌లో జనాగ్రహం మిన్నంటింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా