Share News

లక్ష తుర్కియే డ్రోన్లకు పాక్‌ ఆర్డర్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:29 AM

పాకిస్థాన్‌ తన మానవ రహిత ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. తమకు ఒక లక్ష మెర్కుట్‌ ఎఫ్‌పీవీ(ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ) డ్రోన్లతో పాటు ఇతర మానవ రహిత ఆయుధ వ్యవస్థలు కావాలని తుర్కియే డిఫెన్స్‌ కంపెనీ..

లక్ష తుర్కియే డ్రోన్లకు పాక్‌ ఆర్డర్‌

న్యూఢిల్లీ, నవంబరు 16: పాకిస్థాన్‌ తన మానవ రహిత ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. తమకు ఒక లక్ష మెర్కుట్‌ ఎఫ్‌పీవీ(ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ) డ్రోన్లతో పాటు ఇతర మానవ రహిత ఆయుధ వ్యవస్థలు కావాలని తుర్కియే డిఫెన్స్‌ కంపెనీ పసిఫిక్‌ టెక్నాలజీకి పాకిస్థాన్‌ ఆర్డర్‌ పెట్టింది. ఇందుకు ఆ సంస్థతో మూడేళ్లపాటు అమలులో ఉండే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 10 ఆల్పైన్‌ మానవ రహిత హెలికాప్టర్లు, 25 దమ్రుల్‌ మినీ హెలికాప్టర్లు, 500 డెలీ లాయిటరింగ్‌ మ్యునిషన్లు, 250 కొర్గాన్‌ భూతల వ్యవస్థలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. వీటిని సరఫరా చేయడంతోపాటు పాక్‌లోనేఅసెంబ్లింగ్‌, తయారుచేసేలానూ ఒప్పందం చేసుకున్నారు. కాగా మెర్కుట్‌ ఎఫ్‌పీవీ డ్రోన్‌ 20 నుంచి 30 నిమిషాలపాటు ఎగరడంతోపాటు 8 కి.మీ దూరం వరకు వెళ్లగలదు. దీని వార్‌హెడ్‌లో 1000 స్టీల్‌బాల్స్‌(3 ఎం.ఎం.) ఉంటాయి. ఈ వార్‌హెడ్‌ పేలుడు 20 మీటర్ల పరిధిలో ప్రభావం చూపుతుంది. ఆల్పైన్‌ మానవ రహిత హెలికాప్టర్‌ ఇంధనంతో కలిపి 200 కిలోల వరకు బరువును మోసుకు వెళ్లగలదు. ముందే ప్రోగ్రామ్‌ చేసిన మిషన్లను సొంతంగా(అటానమస్‌) పూర్తిచేసుకురాగలదు. లక్ష్యాలపై 24 గంటలూ నిఘా వేసేందుకు వీలుగా దీనిలో థెర్మల్‌ ఇమేజింగ్‌ పరికరాలు, నైట్‌ విజన్‌ కెమెరాలు అమర్చారు. ఇక దమ్రుల్‌ మినీ విద్యుత్తు హెలికాప్టర్‌ను స్పల్ప దూర లక్ష్యాలపై దాడులకు, నిఘాకు వీలుగా నిర్మించారు. తక్కువ శబ్దంతో పనిచేసే ఈ హెలికాప్టర్‌ శత్రువులు గుర్తించకుండానే లక్ష్యాలపై నిఘా వేసి రాగలదు. తుర్కియేకు చెందిన కాన్‌ ఐదో తరం యుద్ధ విమానాలను కూడా ఈ రెండు దేశాలు సంయుక్తంగా తయారుచేయనున్నాయి.

Updated Date - Nov 17 , 2026 | 03:30 AM