Share News

‘దౌత్యం’తో దాయాది దివాలా

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:06 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలకు వేదికను సమకూర్చి, ప్రపంచం ఎదుట తన గొప్పను ప్రకటించుకోవాలనుకున్న దాయాది పాకిస్థాన్‌కు చేదు అనుభవమే మిగిలింది.

‘దౌత్యం’తో దాయాది దివాలా

  • చర్చలు జరిగిన హోటల్‌ బిల్లు కూడా చెల్లించలేక చేతులు ఎత్తేసిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 14: అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలకు వేదికను సమకూర్చి, ప్రపంచం ఎదుట తన గొప్పను ప్రకటించుకోవాలనుకున్న దాయాది పాకిస్థాన్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆ దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా అయిన హోటల్‌ బిల్లు బరువు ఆతిథ్య దేశాన్ని బెంబేలెత్తించినట్టు తెలిసింది. నెలరోజులకుపైగా పశ్చిమాసియాలో తలపడ్డ అమెరికా-ఇరాన్‌, తాత్కాలికంగా యుద్ధానికి విరామం ప్రకటించి ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఇస్లామాబాద్‌లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చలకు అక్కడి సెరెనా హోటల్‌ ఆతిథ్యం ఇచ్చింది. చర్చల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రతినిధి బృందాలు హోటల్‌లో బస చేశాయి. హోర్ముజ్‌ జలసంధి వంటి అంశాల్లో పీటముడి పడటంతో శాంతి సంప్రదింపుల ప్రక్రియ అర్ధంతరంగా ముగిసింది. దీంతో వారంతా హోటల్‌ గదులు ఖాళీ చేసి తమ దేశాలకు వెళ్లిపోయారు. మూడు రోజుల హోటల్‌ ఖర్చులు మాత్రం ప్రభుత్వానికి మిగిలాయి. అయితే, ఆర్థికంగా దివాలాస్థితిలో ప్రస్తుతం పాక్‌ ఉంది. సరిగ్గా ఈ సమావేశాల నాటికి అప్పు కోసం ఐఎమ్‌ఎఫ్‌ వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హోటల్‌ బిల్లు ఉదంతం అక్కడి లోతైన ఆర్థిక సంక్షోభాన్ని బయటపెట్టింది. ప్రభుత్వం హోటల్‌ బిల్లును చెల్లించకపోవడంతో యాజమాన్యమే నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. హోటల్‌ రంగంలో దిగ్గజ సంస్థ అయిన అఘాఖాన్‌ డెవల్‌పమెంట్‌ నెట్‌వర్క్‌లో సెరెనా హోటల్‌ భాగం. దీంతో అనివార్యంగా ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చిందని సమాచారం. ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమం జరిపేటప్పుడు సాధారణ నిర్వహణ ఖర్చులు ఉంటాయి. కానీ, వాటినీ భరించలేని స్థితిలో పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ ఉన్నదని మనదేశానికి చెందిన ఉన్నతస్థాయి నిఘా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Updated Date - Apr 15 , 2026 | 04:06 AM