పాక్‌లో పెట్రోల్ ధర రూ.80 తగ్గింపు!
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:38 AM
పొరుగు దేశం పాకిస్థాన్‌లో గురువారం భారీగా పెంచిన పెట్రో ధరలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ దేశప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది...
లీటరు 458.41 నుంచి 378కి తగ్గిన ధర
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : పొరుగు దేశం పాకిస్థాన్‌లో గురువారం భారీగా పెంచిన పెట్రో ధరలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ దేశప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. పెట్రోల్ ధర లీటరుకు 80 రూపాయలు(పాక్) తగ్గిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. దీంతో లీటరు పెట్రోల్ ధర 378 పాక్ రూపాయలకు తగ్గనుంది. పాక్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను గురువారం నుంచి ఏకంగా 43 శాతం, 55 శాతం చొప్పున పెంచారు. దీంతో లీటరు పెట్రోల్ ధర 321.17 నుంచి ఏకంగా 458.41 పాక్ రూపాయలకి పెరిగింది. డీజిల్ ధర 335.86 నుంచి 520.35కి పాక్ రూపాయలకి పెరిగింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. వెంటనే స్పందించిన షహబాజ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించడంతోపాటు పాక్ మంత్రులంతా ఆరు నెలలపాటు జీతాలు తీసుకోరని ప్రకటించారు. పొదుపు చర్యల్లో భాగంగానే మంత్రులు జీతాలు వదులుకుంటున్నట్లు ప్రకటించారు.