Share News

పాక్‌లో రక్తపుటేరులు

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:25 AM

పాకిస్థాన్‌లో రక్తపుటేరులు పారుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్‌ అయిన బలోచిస్థాన్‌లో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ)కి, పాకిస్థాన్‌ సైన్యానికి మధ్య గత శుక్రవారం నుంచి జరుగుతున్న భీకర పోరాటంలో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు...

పాక్‌లో రక్తపుటేరులు

  • బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ భీకర ఆత్మాహుతి దాడులు

  • 200 మంది పాక్‌ సైనికులు, పోలీసులను చంపినట్లు ప్రకటన

  • 177 మంది బలోచ్‌ తిరుగుబాటుదారులను చంపాం: పాక్‌

ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి 2: పాకిస్థాన్‌లో రక్తపుటేరులు పారుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్‌ అయిన బలోచిస్థాన్‌లో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ)కి, పాకిస్థాన్‌ సైన్యానికి మధ్య గత శుక్రవారం నుంచి జరుగుతున్న భీకర పోరాటంలో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బీఎల్‌ఏ.. ఏకకాలంలో దాదాపు ఐదు జిల్లాల్లో ‘హీరోఫ్‌-2 పేరుతో భీకర దాడులు చేసింది. తమ దాడిలో 200 మంది పాక్‌ సైనికులు, పోలీసులు, పారామిలిటరీ సైనికులు చనిపోయినట్లు బీఎల్‌ఏ ప్రతినిధి జీయంద్‌ బలోచ్‌ సోమవారం ప్రకటించారు. గ్వాదర్‌లో సైనిక, పోలీస్‌ క్యాంపులపై విరుచుకుపడి తీవ్ర నష్టం కలిగించిన ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్ల ఫొటోలను విడుదల చేశారు. వారు హవా బలోచ్‌, అసీఫా మెంగల్‌ అని తెలిపారు. మరోవైపు బీఎల్‌ఏ దాడులను తిప్పికొట్టినట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. తమ బలగాల దాడిలో ఆదివారం నాటికి 177 మంది తిరుగుబాటుదారులు చనిపోయినట్లు తెలిపింది. బీఎల్‌ఏను భారతదేశమే హింసకు ప్రేరేపిస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయటం పాకిస్థాన్‌కు అలవాటేనని విదేశాంగ శాఖ విమర్శించింది. కాగా ఇద్దరు మహిళలతోపాటు 11 మంది తమ ఆత్మాహుతి బాంబర్లు పాక్‌ సైన్యంపై దాడిచేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. మహిళా ఫిదాయీ హవా బలోచ్‌ ఆత్మాహుతి దాడికి ముందు పాక్‌ సైనికులతో పోరాడుతూ, మాట్లాడిన వీడియోను విడుదల చేసింది. మొబైల్‌లో చిత్రీకరించిన ఆ వీడియోలో పాక్‌ సైనికులు తమను ఎదుర్కోలేక తోక ముడిచారని ఆమె నవ్వుతూ చెప్పటం కనిపిస్తోంది.

Updated Date - Feb 03 , 2026 | 02:25 AM