Share News

అఫ్గానిస్థాన్‌లో పాక్‌ వైమానిక దాడులు

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:44 AM

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ మరోసారి వైమానిక దాడులు చేసింది. శనివారం అర్ధరాత్రి అఫ్గానిస్థాన్‌లోని నంగర్‌హర్‌, పక్తిక ప్రావిన్సుల్లో ...

అఫ్గానిస్థాన్‌లో పాక్‌ వైమానిక దాడులు

  • తెహ్రీక్‌ ఏ తాలిబాన్‌, ఐఎస్‌ స్థావరాలపై బాంబులు

  • 70 మంది ఉగ్రవాదుల హతం: పాక్‌

ఇస్లామాబాద్‌/కాబూల్‌, ఫిబ్రవరి 22: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ మరోసారి వైమానిక దాడులు చేసింది. శనివారం అర్ధరాత్రి అఫ్గానిస్థాన్‌లోని నంగర్‌హర్‌, పక్తిక ప్రావిన్సుల్లో తెహ్రీక్‌ ఏ తాలిబాన్‌ పాకిస్థాన్‌(టీటీపీ), ఇస్లామిక్‌ స్టేట్‌- ఖొరాసన్‌ ప్రావిన్స్‌(ఐఎ్‌సకేపీ) ఉగ్రవాద సంస్థల స్థావరాలే లక్ష్యంగా ఏడు చోట్ల దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఇటీవల తమ దేశంలోని ఇస్లామాబాద్‌, బజౌర్‌, బన్నులలో జరిగిన ఆత్మాహుతి దాడులకు సూత్రధారులైన టీటీపీ, ఐఎ్‌సకేపీ నేతలను మట్టుబెట్టేందుకు లక్షిత దాదులు చేసినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు మరణంచినట్లు పాక్‌ మంత్రి తలాల్‌ చౌధరి తెలిపారు. అఫ్గానిస్థాన్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. అయితే, పాక్‌ దాడుల్లో సాధారణ పౌరులే మరణించారని అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం ఆరోపించింది. నంగర్‌హర్‌ ప్రావిన్సులోని బిహ్సుద్‌ జిల్లా గిర్దికాస్‌ గ్రామంలో పాక్‌ వైమానిక దళం జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు. తన కుటుంబంలోని 23 మందిలో ఐదుగురే మిగిలారని షహబుద్దీన్‌ అనే వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

ప్రతీకారం తప్పదు: తాలిబాన్‌

పాక్‌ దాడులను అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరైన సమయంలో సరైన రీతిలో పాక్‌కు బదులిస్తామని తాలిబాన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఆదివారం హెచ్చరించారు. పాక్‌ దాడుల్లో అమాయకులైన మహిళలు, పిల్లలే మరణించారని ఆరోపించారు. స్కూళ్లు, పౌరుల ఇళ్లపైనే దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల ద్వారా అంతర్జాతీయ చట్టాల తోపాటు అఫ్గానిస్థాన్‌ సార్వభౌమత్వాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘించిందని మండిపడ్డారు.

Updated Date - Feb 23 , 2026 | 01:44 AM