అఫ్ఘాన్‌పై పాక్ వైమానిక దాడులు
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:55 AM
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ వైమానిక దాడులతో విరుచుకుపడింది.
26 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటన
ఇస్లామాబాద్/కాబూల్, జూన్ 10: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 26 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ ప్రకటించగా.. చిన్నారులు, మహిళలు సహా పౌరులే మృతిచెందారని అఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఇరుదేశాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి. పాక్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ప్రతిచర్యగా అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతంలోని తెహ్రీక్-ఇ- తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన స్థావరాలపై లక్ష్యిత వైమానిక దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార మంత్రి తరార్ ప్రకటించారు. ఈ వాదనలను అఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. కునార్, ఖోస్ట్, పక్తికా ప్రావిన్సుల్లోని పౌర నివాసాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఆరోపించారు. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఓ మహిళ, ఓ వృద్ధుడు మరణించగా.. మరో 14 మంది గాయపడినట్లు పేర్కొన్నారు.