కాబూల్‌లో ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:34 AM
అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్ అత్యంత పాశవిక దాడికి పాల్పడింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో మత్తు పదార్థాలకు బానిసైన వారికి చికిత్స అందించే ఓ ఆస్పత్రి....
400 మంది రోగులు మృతి.. 250 మందికి గాయాలు
పూర్తిగా ధ్వంసమైన ఆస్పత్రి
3వేల మంది మత్తు పదార్థాల బానిసలకు ఇక్కడ చికిత్స
ఆస్పత్రిపై మేం దాడి చేయలేదు
తాలిబాన్ల మిలిటరీ స్థావరాలపై బాంబులేశాం: పాకిస్థాన్
ఇకపై పాక్‌తో చర్చలుండవు..అఫ్గానిస్తాన్ ప్రకటన
ఆస్పత్రిపై దాడి అనాగరిక చర్య..భారత్ ఖండన
కాబూల్/ ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ, మార్చి 17: అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్ అత్యంత పాశవిక దాడికి పాల్పడింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో మత్తు పదార్థాలకు బానిసైన వారికి చికిత్స అందించే ఓ ఆస్పత్రి(రిహాబిలిటేషన్ సెంటర్)పై పాక్ సోమవారం రాత్రి వైమానిక దాడులు చేయటంతో 400 మంది రోగులు మర ణించారు. 250 మంది వరకు గాయపడ్డారని అఫ్గానిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు. పాక్ బాంబుదాడిలో ఆస్పత్రిలోని 5 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. మృతుల్లో దాదాపు అందరూ రోగులేనని చెప్పారు. ఈ ఆస్పత్రిలో దాదాపు మూడు వేల మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో చెలరేగిన మంటలను అదుపుచేసి, మృతదేహాలను వెలికితీస్తున్న వీడియోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఉప మంత్రి మొహమ్మద్ నబీ ఒమరీ మంగళవారం ఆస్పత్రిని పరిశీలించారు. అఫ్గాన్ పౌరులకు చంపటమే పాకిస్థాన్ పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. తమ పౌరులను పాశవికంగా చంపుతున్న పాకిస్థాన్‌తో ఇకపై చర్చలుండవని తేల్చిచెప్పారు. ఈ దాడిలో 200 మంది మరణించారని మొదట ప్రకటించిన తాలిబాన్ పాలకుల ప్రతినిధులు.. ఆ సంఖ్య 400లకు పెరిగిందని మంగళవారం ప్రకటించారు. ఆస్పత్రి వద్ద పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. కాబూల్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా బాంబులు పేలాయని స్థానికులు తెలిపారు. ఈ బాంబు దాడుల ధాటికి నగరం మొత్తం కంపించిందని చెప్పారు.
మేము ఆస్పత్రిపై దాడి చేయలేదు: పాక్
ఆస్పత్రిపై వైమానిక దాడి చేశారన్న ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. తాము అఫ్గాన్ తాలిబాన్ల మిలిటరీ స్థావరాలు, ఆయుధ డిపోలపైనే దాడులు చేశామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి మొషార్రఫ్ జైదీ మంగళవారం తెలిపారు. నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని ఘనీఖేల్ జిల్లాలో ఉన్న తాలిబాన్ల మిలిటరీ స్థావరంపై కూడా పాక్ వైమానిక దాడి చేసింది. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులను నిర్మూలించే చర్యలను తాలిబాన్ పాలకులు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన కొన్ని గంటలకే కాబూల్ ఆస్పత్రిపై పాక్ దాడి చేసింది. ఈ రెండు దేశాల మధ్య గత మూడు వారాలుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారం కూడా కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం కాల్పుల్లో తమ పౌరులు నలుగురు చనిపోయారని తాలిబాన్లు ఆరోపించారు. కాగా, మూడు వారాల్లో ఇప్పటివరకు 684 మంది తాలిబాన్లు మరణించారని, 912 మంది గాయపడ్డారని పాకిస్థాన్ సమాచార శాఖ ప్రతినిధి అతొల్లా తరార్ తెలిపారు.
ఆస్పత్రిపై దాడి మతిలేని చర్య: భారత్
కాబూల్ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ దాడి అత్యంత పాశవికమైనది, క్రూరమైనది, మతిలేని చర్య అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ మండిపడ్డారు.