Share News

పాక్‌, అఫ్గానిస్థాన్‌ భీకర ఘర్షణ

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:37 AM

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య సైనిక ఘర్షణ భీరక యుద్ధంగా మారుతోంది. పాకిస్థాన్‌ వైమానిక దళం ఇటీవల అఫ్గానిస్థాన్‌లో దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆ దేశ పాలక తాలిబాన్లు..

పాక్‌, అఫ్గానిస్థాన్‌ భీకర ఘర్షణ

  • సరిహద్దుల్లో పాక్‌ సైనిక పోస్టులపై తాలిబాన్ల దాడి

  • ప్రతిగా కాబూల్‌, కాందహార్‌పై పాక్‌ వైమానిక దాడులు

  • 55 మంది పాక్‌ సైనికులను హతమార్చాం, ఎఫ్‌-16ను కూల్చాం: అఫ్గానిస్థాన్‌

  • 133 మంది తాలిబాన్‌ ఫైటర్లను మట్టుబెట్టాం: పాక్‌

ఇస్లామాబాద్‌/ కాబూల్‌, ఫిబ్రవరి 27: పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య సైనిక ఘర్షణ భీరక యుద్ధంగా మారుతోంది. పాకిస్థాన్‌ వైమానిక దళం ఇటీవల అఫ్గానిస్థాన్‌లో దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆ దేశ పాలక తాలిబాన్లు.. గురువారం రాత్రి నుంచి సరిహద్దుల్లో డ్యురాండ్‌ రేఖ వెంబడి ఉన్న పాకిస్థాన్‌ సైనిక పోస్టులపై మెరుపు దాడులు మొదలుపెట్టారు. అంతకు కొద్దిసేపటికి ముందే పాక్‌ సైన్యంపై ప్రతీకార దాడులు చేయబోతున్నట్లు తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. తాలిబాన్లు దాడులు ప్రారంభించిన వెంటనే పాక్‌ సైన్యం స్పందించింది. పాక్‌ ఫైటర్‌ జెట్లు అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌, పక్తియాల్లో బాంబు దాడులు చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ నగరాల్లో పలుచోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దట్టమైన పొగ, మంటలు వీడియోల్లో కనిపించాయి. పాక్‌ ఫైటర్‌ జెట్లు అఫ్గాన్‌ నగరాలపై చక్కర్లు కొట్టాయి.

మృతుల సంఖ్యపై భిన్న వాదనలు

సైనిక ఘర్షణలో మృతుల సంఖ్యపై పాక్‌, అఫ్గానిస్థాన్‌ భిన్న ప్రకటనలు చేశాయి. 133 తాలిబాన్‌ ఫైటర్లను చంపేశామని పాక్‌ సైన్యం ప్రకటించగా, తమ ఫైటర్లు 8 మందే మరణించారని జబీహుల్లా ప్రకటించారు. భూతల, వైమానిక దాడుల్లో 200 మంది తాలిబాన్‌ ఫైటర్లు గాయపడ్డారని, 27 అఫ్గానిస్థాన్‌ సైనిక పోస్టులను ధ్వంసం చేసి, తొమ్మిదింటిని స్వాధీనం చేసుకున్నామని పాక్‌ సైన్యం తెలిపింది. తమ దాడుల్లో 55 మంది పాక్‌ సైనికులు మరణించారని, సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు తెలిపారు. అయితే, తమ సైనికులు ఇద్దరే మరణించారని పాక్‌ అధికారులు శుక్రవారం తెలిపారు.


ఇక బహిరంగ యుద్ధమే: పాక్‌ మంత్రి

అఫ్గానిస్థాన్‌తో పూర్తిస్థాయి, బహిరంగ యుద్ధం ప్రారంభమైందని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌ శుక్రవారం ప్రకటించారు. ‘అఫ్గానిస్థాన్‌ నుంచి నాటో వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్లు అఫ్గానిస్థాన్‌ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంతంలో సుస్థిరత కోసం కృషి చేస్తారని ఆశిం చాం. కానీ, మా దేశంలో దాడులు చేస్తున్న తెహ్రీక్‌ ఏ తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ), ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు అఫ్గాన్‌ స్థావరంగా మారింది. ఇక మా ఓపిక నశించింది. ఇప్పుడిక మీతో (అఫ్గానిస్థాన్‌) పూర్తిస్థాయి యుద్ధమే’ అని స్పష్టంచేశారు.

తాలిబాన్ల ఆత్మాహుతి దళం సిద్ధం

పాక్‌తో భీకర ఘర్షణల వేళ.. అఫ్గానిస్థాన్‌ పాలకులు పూర్తిస్థాయి ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ దేశంలోని నంగర్‌హర్‌లో ఆత్మాహుతి కిట్లు ధరించి దాడికి సిద్ధంగా ఉన్నఫైటర్ల ఫొటోను అధికార బఖ్తర్‌ న్యూస్‌ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. బాంబులు అమర్చిన జాకెట్లు ధరించి, కారు బాంబులతో తమ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని తాలిబాన్ల డిప్యూటీ ప్రతినిధి హమ్‌దుల్లా ఫిత్రత్‌ చెప్పినట్లు ఆ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, సైనిక ఘర్షణలను వెంటనే ఆపాలని రెండు దేశాలకు ఇరాన్‌ సూచించింది. పాక్‌, అఫ్గాన్‌ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని తెలిపింది.

ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం

తమ దేశంలో దాడులకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని తాలిబాన్లు ప్రకటించారు. అయితే, ఆ విమానాన్ని దేనితో కూల్చేశారన్న వివరాలు తెలపలేదు. విమాన శకలాల ఫొటోలు కూడా బయటపెట్టలేదు. ఈ ప్రకటనను పాక్‌ ఖండించింది. మరోవైపు పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌తోటు రావల్పిండి, అబొటాబాద్‌ తదితర నగరాలపై వైమానిక దాడులు చేసినట్లు తాలిబాన్లు ప్రకటించారు.

Updated Date - Feb 28 , 2026 | 06:18 AM