ఇరాన్‌లో 10వేల మంది భారత విద్యార్థులు!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:51 AM
ఇరాన్‌లో భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ విద్యనభ్యసించేందుకు పెద్దసంఖ్యలో వెళ్లిన భారతీయుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
వారిలో వైద్య విద్యార్థుల సంఖ్యే ఎక్కువ
ఇరాన్‌లో మెడిసిన్ కోర్సు చౌక!
యుద్ధంతో విద్యార్థుల్లో భయం
హైదరాబాద్ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌లో భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ విద్యనభ్యసించేందుకు పెద్దసంఖ్యలో వెళ్లిన భారతీయుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. దాదాపు 10 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఇరాన్‌లో విద్యనభ్యసిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరిలో అత్యధిక మంది వైద్య విద్య అభ్యసించడానికి వెళ్లినవారేనని సమాచారం. ఇరాన్‌లో వైద్య విద్యకు ఇంత డిమాండ్ ఎందుకు? అని విచారిస్తే.. భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో అక్కడ మెడిసిన్ పూర్తి చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ నీట్ పోటీని తట్టుకొని మెడిసిన్ సీటు సాధించడం ఆషామాషీ కాదు. ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో చదవాలంటే కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. అదే ఇరాన్‌లో సగానికి సగం ఖర్చుతో ఎంబీబీఎస్ పట్టా పొందవచ్చునని ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు చెబుతున్నారు. ఇరాన్‌లోని వైద్య విద్యా బోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో కొనసాగడం, అక్కడి మెడిసిన్ పట్టాకు అంతర్జాతీయ గుర్తింపు ఉండడం కూడా భారతీయ విద్యార్థులు మొగ్గు చూపడానికి ఒక ప్రధాన కారణం అంటున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజధాని టెహ్రాన్‌లోని 1200 మందికిపైగా భారతీయ విద్యార్థులను మంగళవారం ఖోమ్ వంటి సురక్షిత ప్రాంతాలకు బస్సుల ద్వారా తరలించినట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అతికొద్ది మంది విద్యార్థులు మాత్రం ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతుండగా, కొద్దిమంది మాత్రం ప్రతికూల పరిస్థితులు నెలకొనడానికి ముందే స్వదేశానికి వచ్చినట్లు సమాచారం.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చి రెండో వారంలో పరీక్షలు ఉండగా వారు ఎటూ తేల్చుకోలేక, విద్యా సంవత్సరం వృథా అవుతుందన్న ఆందోళనతో అక్కడే ఉన్నారు. అలా వారంతా టెహ్రాన్‌లో చిక్కుకున్నారు. రోజూ భీకరమైన శబ్దాలు వింటూ.. ఏ క్షణాన తమపై బాంబుల వర్షం కురుస్తుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నామని కొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అర్థిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్థితి ఇలానే భారతీయ విద్యార్థులను ఇరాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా రోడ్డు మార్గంలో తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం.