ఆంథ్రోపిక్ ఔట్.. ఓపెన్ ఏఐ ఇన్!
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:21 AM
ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ‘ఆంథ్రోపిక్’, అమెరికా ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా యుద్ధ విభాగంతో ఓపెన్ ఏఐ ఒప్పందం
వాషింగ్టన్, ఫిబ్రవరి 28: ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ‘ఆంథ్రోపిక్’, అమెరికా ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా యుద్ధ విభాగం (డీవోడబ్ల్యూ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మరో కృత్రిమ మేధ కంపెనీ ‘ఓపెన్‌ఏఐ’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు. వారి క్లాసిఫైడ్ మిలటరీ నెట్‌వర్క్‌లకు తమ ఏఐ మోడళ్లను సరఫరా చేస్తామని వెల్లడించారు. ఏఐ భద్రత, దాని ప్రయోజనాల విస్తృత పంపిణీ తమ మిషన్ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. దేశీయ సామూహిక నిఘాపై నిషేధం, స్వయంప్రతిపత్తి ఆయుధ వ్యవస్థలతో సహా బలప్రయోగానికి మానవ బాధ్యత అనేది తమ రెండు ముఖ్యమైన భద్రతా సూత్రాలు అని ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. ఈ సూత్రాలను డీవోడబ్ల్యూ అంగీకరించిందని, వాటిని తమ ఒప్పందంలో చేర్చినట్లు వెల్లడించారు. ఆంథ్రోపిక్ ఏఐ టెక్నాలజీని వినియోగించడాన్ని అన్ని ప్రభుత్వ సంస్థలు ఆపేయాలని ట్రంప్ శుక్రవారం ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ విషయంలో ట్రంప్ రక్షణ శాఖకు ఆరు నెలల సమయం ఇచ్చారు. వామపక్ష భావజాలమున్న ఒక కంపెనీ తమ సైన్యం యుద్ధాల్లో ఎలా పోరాడాలని, ఎలా గెలవాలనే దాన్ని నిర్దేశించేందుకు అనుమతించబోమన్నారు. ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ మోడల్స్‌ను అమెరికా మిలటరీ అపరిమతంగా, ఎలాంటి నియంత్రణలు లేకుండా వినియోగించుకొనేందుకు యాక్సెస్ ఇవ్వాలన్న ట్రంప్ డిమాండ్‌కు ఆ కంపెనీ తిరస్కరించడంతో వివాదం రాజుకుంది. శుక్రవారం వరకు విధించిన డైడ్‌లైన్ ముగియడంతో.. ట్రంప్ తాజా ఆదేశాలు జారీచేశారు. తమ కంపెనీ ప్రోడక్టులను దాని భద్రతా చర్యలను ఉల్లంఘించే విధంగా ఉపయోగించవచ్చనే ఆందోళనపై ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ వెనక్కి తగ్గలేదు. దీంతో తమకు ఆంథ్రోపిక్ టెక్నాలజీ అవసరం లేదని, ఆ కంపెనీతో మరోసారి వ్యాపారం చేయబోమని ట్రంప్ సోషల్ మీడియాతో ప్రకటించారు.