హ్యూమనాయిడ్ రోబోల తయారీలో ఓపెన్ ఏఐ
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:28 AM
ఇన్నాళ్లూ కృత్రిమ మేధ (అంటే సాఫ్ట్‌వేర్) అభివృద్ధికే పరిమితమైన చాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ఇప్పుడు సొంతంగా ‘హ్యూమనాయిడ్ రోబో’లను తయారుచేస్తోంది.
వెల్లడించిన సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్
మొదటి డెమో 2027లో ఇవ్వనున్నట్టు వెల్లడి
న్యూయార్క్, అక్టోబరు 19: ఇన్నాళ్లూ కృత్రిమ మేధ (అంటే సాఫ్ట్‌వేర్) అభివృద్ధికే పరిమితమైన చాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ఇప్పుడు సొంతంగా ‘హ్యూమనాయిడ్ రోబో’లను తయారుచేస్తోంది. అంటే.. తాము అభివృద్ధి చేస్తున్న కృత్రిమ మేధను ఒక భౌతిక రూపం (హార్డ్‌వేర్)లో పొందుపరుస్తోందన్నమాట. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు. తమ రోబోల మొదటి డెమోను 2027లో ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. హ్యూమనాయిడ్ రోబోలే ఎందుకు తయారుచేస్తున్నారనే ప్రశ్నకు.. నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులన్నీ మానవ శరీర నిర్మాణానికి అనుగుణంగా రూపొందించుకున్నవే కాబట్టి, తమ రోబోలను కూడా మానవ రూపంలోనే అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన బదులిచ్చారు. అయితే, కృత్రిమ మేధ దెబ్బకు వైట్‌కాలర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో పోతున్నాయనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడా కృత్రిమ మేధకు శరీరం కూడా తోడై హ్యూమనాయిడ్ రోబోల రూపంలో అందుబాటులోకి వస్తే.. బ్లూకాలర్ జాబ్స్ (శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు) కూడా పోయే ప్రమాదం ఉందని, అవి కార్మికుల ఉద్యోగాలకు ఎసరు పెడతాయని.. ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో సానుకూల అంశం ఏమిటంటే.. పేషెంట్లను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకునే కేర్‌టేకర్ల కొరత వైద్యరంగంలో వేగంగా పెరుగుతోంది. హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వస్తే ఆ కొరత తీరుతుందన్న ఆశాభావం ఉంది. అలాగే వంటగది లో కొన్ని నిర్దిష్ట పనులు చేయడానికి, తయారీ రంగం, ఫ్యాక్టరీల్లో భారీ విడిభాగాలు అమర్చడానికి, రవాణా రంగంలో పార్శిళ్లను లోడింగ్, అన్‌లోడింగ్ చేయడం, భూకంపాల వంటివి వచ్చినప్పుడు కూలిన భవనాల్లోకి వెళ్లి లోపల చిక్కుకుపోయిన మనుషులను తేవడానికి, విషవాయువులు వ్యాపించిన చోట, రేడియేషన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని కాపాడడానికి, చంద్రుడు, కుజుడిపై పరిశోధనలకు.. ఇలా చాలా రంగాల్లో ఉపయోగపడతాయి. అయితే, తమ రోబోలకు సంబంధించి తొలి డెమోని 2027లో ఇచ్చినప్పటికీ.. అవి ఇప్పుడిప్పుడే అందరికీ అం దుబాటులోకి రావని, అందుకు చాలా ఏళ్లే పడుతుందని ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు.
పెరగనున్న పోటీ..
ఈలన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ ‘ఆప్టిమస్’ పేరుతో.. చైనాకు చెందిన యూనిట్రీ, ఎక్స్‌పెంగ్ వంటి కంపెనీలు కృత్రిమ మేధతో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోల తయారీలో ఇప్పటికే వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. ఓపెన్‌ఏఐ కూడా ఆ రంగంలోకి వస్తే.. కృత్రిమ మేధ పరిశోధనలు చేస్తున్న గూగుల్, మెటా, ఆంత్రోపిక్ వంటి సంస్థలూ పోటీలోకి దిగే అవకాశాలు పెరిగిపోతాయి. అదే జరిగితే.. ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డట్టు హ్యూమనాయిడ్ రోబోలు రావడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చు. సామాన్యుల కు ఉపయోగపడే స్థాయిలో కాకపోయినా.. వాణిజ్యస్థాయిలో (అంటే ఆస్పత్రుల్లో కేర్‌టేకర్లుగా, పారిశ్రామిక ఉత్పత్తిలో ఉపయోగపడే రోబోలు) అందుబాటులోకి వచ్చే అవకాశమే ఎక్కువని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంత కృత్రిమ మేధతో పనిచేసే రోబోలే అయినా, అవి మానవశక్తిని భర్తీ చేయలేవని.. వాటి రాకతో కొన్ని ఉద్యోగాలు పోయినా, వాటితో పనిచేయించడానికి, వాటి పనిని పర్యవేక్షించడానికి మానవుల అవసరం ఉంటుందని.. కాబట్టి ఉద్యోగాలు పోతాయేమోనన్న ఆందోళన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.