Share News

కెనడా పాఠశాలలో కాల్పులపై ఓపెన్‌ ఏఐకి ముందే తెలుసు

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:10 AM

కెనడాలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ ఏఐ చిక్కుల్లో పడింది. నిందితురాలు ఈ దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓపెన్‌ ఏఐకి ముందే తెలుసని....

కెనడా పాఠశాలలో కాల్పులపై ఓపెన్‌ ఏఐకి ముందే తెలుసు

  • కానీ అప్రమత్తం చేయలేదంటూ కోర్టుకెక్కిన బాధితులు

టంబ్లర్‌ రిడ్జ్‌, మార్చి 10: కెనడాలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ ఏఐ చిక్కుల్లో పడింది. నిందితురాలు ఈ దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓపెన్‌ ఏఐకి ముందే తెలుసని, అయినప్పటికీ పోలీసులను అప్రమత్తం చేయడంలో ఆ సంస్థ విఫలమైందని దాడిలో గాయపడిన ఓ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం చాట్‌ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్‌ఏఐపై బ్రిటిష్‌ కొలంబియాలోని సుప్రీం కోర్టులో సివిల్‌ దావా వేశారు. ఫిబ్రవరి 10న బ్రిటిష్‌ కొలంబియాలోని టంబ్లర్‌ రిడ్జ్‌ పాఠశాలలో జెస్సీ వాన్‌ రూస్ట్‌లార్‌ అనే మహిళ ఎనిమిది మందిని కాల్చి చంపింది. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై ఓపెన్‌ ఏఐ స్పందిస్తూ, నిందితురాలి చాట్‌ జీపీటీ ఖాతాను గతంలోనే నిలిపివేసినట్లు తెలిపింది. అయితే ఆమె మరో ఖాతా ద్వారా ఈ కుట్రకు పాల్పడిందని పేర్కొంది. నిందితురాలు తన దాడుల ప్రణాళికను రూపొందించుకోవడానికి చాట్‌ జీపీటీని ఒక నమ్మకమైన స్నేహితుడిగా, సహకారిగా ఉపయోగించుకుందని బాధితుల తరఫు న్యాయవాదులు తెలిపారు. నిందితురాలి అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఓపెన్‌ ఏఐ అంతర్గతంగా చర్చించినప్పటికీ, ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయలేదని ఆరోపించారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారికి ఈ చాట్‌బాట్‌ స్వచ్ఛందంగా సహకరిస్తోందని మండిపడ్డారు. కాగా, ఈ దావాపై స్పందించడానికి ఓపెన్‌ ఏఐ ప్రతినిధి నిరాకరించారు.

Updated Date - Mar 11 , 2026 | 04:10 AM