Share News

చమురు మంటలు?

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:17 AM

ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలు విఫలమై, మళ్లీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో చమురు ధరలు మళ్లీ భగ్గుమనే అవకాశం ఉంది.

చమురు మంటలు?

  • ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలు విఫలం

  • ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం

  • ఆ భారాన్ని వినియోగదారుడిపై మోపే సూచనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలు విఫలమై, మళ్లీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో చమురు ధరలు మళ్లీ భగ్గుమనే అవకాశం ఉంది. ఇప్పటికే ముడి చమురు బ్యారెల్‌కు వంద డాలర్లు దాటింది. హోర్ముజ్‌ జలసంధిని దిగ్బంధించాలని తన నౌకా దళాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం ఆదేశించటంతో ఆ మార్గం ద్వారా ముడి చమురు, సహజవాయువు సరఫరా పూర్తిగా ఆగిపోనుంది. దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే చమురు ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన రంగ నిపుణులు అంచనా వేశారు. ఇరాన్‌- అమెరికా యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 112 డాలర్ల వరకు పెరిగి.. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత దిగొచ్చాయి. ప్రస్తుతం బ్యారెల్‌కు దాదాపు 96 డాలర్లు ఉంది. యుద్ధం మళ్లీ మొదలై దీర్ఘకాలం కొనసాగితే బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారతదేశం తన చమురు, గ్యాస్‌ దిగుమతుల్లో అత్యధికం హోర్ముజ్‌ జలసంధి ద్వారానే తెచ్చుకుంటోంది. ఆ మార్గం పూర్తిగా మూత పడితే.. రష్యా, అమెరికా వంటి మార్కెట్లపై ఆధారపడాలి. అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఇంధన ధరలతోపాటు రవాణా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు ధరలు పెరిగినా, ఆ భారం వినియోగదారుడిపై పడకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గిస్తూ వస్తోంది. ఇకపై అలా చేయకపోవచ్చని, ధరల భారాన్ని కంపెనీలు వినియోగదారుడిపై మోపక తప్పదని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ వశిష్ట్‌ తెలిపారు. ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Updated Date - Apr 13 , 2026 | 05:17 AM