ఎన్విడియా షేరు.. నిన్న రికార్డు, నేడు పతనం
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:04 AM
ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ పునర్నియామకంతో సోమవారం(నవంబరు 23) అమెరికా స్టాక్ మార్కెట్‌లో రికార్డు సృష్టించిన ఆ కంపెనీ షేరు.. మంగళవారం మళ్లీ పతనమైంది.
ఒక్కరోజే రూ.89లక్షల కోట్లు పెరిగిన విలువ.. మర్నాడే 8శాతం డౌన్
సీఈవోగా జెన్సన్ పునర్నియామకంతో సోమవారం 31.48శాతం ఎగిసిన ఎన్విడియా షేరు
స్టాక్ మార్కెట్ చరిత్రలో కొత్త రికార్డు
మంగళవారం లాభాల స్వీకరణ.. ఏఐ షేర్లపై మళ్లీ అమ్మకాల ఒత్తిడి
న్యూఢిల్లీ, నవంబరు 24: ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ పునర్నియామకంతో సోమవారం(నవంబరు 23) అమెరికా స్టాక్ మార్కెట్‌లో రికార్డు సృష్టించిన ఆ కంపెనీ షేరు.. మంగళవారం మళ్లీ పతనమైంది. సోమవారం ఒక్కరోజే 31.48శాతం పెరిగిన ఎన్విడియా షేరు మంగళవారం ట్రేడింగ్‌లో సుమారు 8శాతం పడిపోయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత షేరు ధర సుమారు 151 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపు ధర 165.05 డాలర్లు. ఎన్విడియాతో పాటు ఇతర ఏఐ కంపెనీల షేర్లూ నష్టపోయాయి. మైక్రాన్, ఏఎండీ షేర్లు 10 శాతానికి పైగా, ఒరాకిల్ 3 శాతానికి పైగా, బ్రాడ్‌కామ్ సుమారు 3 శాతం పడిపోయాయి. గత వారమే స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన ఏఐ సంస్థ ఆంత్రోపిక్ షేరు 12శాతం పతనమై.. ఐపీవో ధర 83డాలర్ల కంటే దిగువకు చేరింది. టెక్ షేర్ల ప్రభావంతో నాస్‌డాక్ సూచీ 2 శాతానికి పైగా, ఎస్‌అండ్‌పీ 500 సూచీ సుమారు 1 శాతం తగ్గాయి. ఏఐయేతర కంపెనీల షేర్ల బలంతో డౌజోన్స్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. సోమవారం భారీ పెరుగుదల తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, ఏఐ రంగంలో పెడుతున్న భారీ పెట్టుబడులకు తగిన రాబడి వస్తుందా అన్న సందేహాలు, జెన్సన్ పునర్నియామకంపై కార్పొరేట్ గవర్నెన్స్ ప్రశ్నలు ఇంకా కొనసాగుతుండటం ఈ పతనానికి కారణాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా సహా పలు దేశాలపై సుంకాలు పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం, ఈ వారం వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. జెన్సన్ తిరిగి వచ్చినంత మాత్రాన చైనాకు చిప్‌ల ఎగుమతిపై అమెరికా ఆంక్షలు సడలే అవకాశం లేదని చైనా అధికార మీడియా వ్యాఖ్యానించడం కూడా ఎన్విడియా షేరుపై ప్రభావం చూపింది.
ఒక్కరోజులోనే 950 బిలియన్ డాలర్లు
సోమవారం ఒక్కరోజే ఎన్విడియా సంస్థ మార్కెట్ విలువ 3.03 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.98 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. అంటే దాదాపు 950 బిలియన్ డాలర్లు పెరిగింది. భారత కరెన్సీలో చూస్తే ఈ విలువ సుమారు రూ.89లక్షల కోట్లు. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులోనే ఒక కంపెనీ విలువ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. 2003 తర్వాత ఎన్విడియా షేరుకు ఇదే అత్యుత్తమ రోజు. గతంలో 2026 జూలైలో మైక్రోసాఫ్ట్ నమోదు చేసిన 450 బిలియన్ డాలర్లే(సుమారు రూ.42 లక్షల కోట్లు) ఇప్పటివరకు రికార్డుగా ఉంది. దీనితో పోలిస్తే సోమవారం ఎన్విడియా మార్కెట్ విలువలో పెరుగుదల రెట్టింపు కన్నా ఎక్కువ. అయితే, మంగళవారం సుమారు 8ు పతనంతో సోమవారం పెరిగిన విలువలో దాదాపు 320 బిలియన్ డాలర్లు(సుమారు రూ.30 లక్షల కోట్లు) ఆవిరైంది.
మరింత మెరుగైన సీఈవోగా పనిచేస్తా
ఎన్విడియా సీఈవోగా తిరిగి నియామకం అయ్యాక జెన్సన్ శాంటాక్లారాలోని కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఆఫీసులోకి వెళ్లగానే ఉద్యోగులు ఉత్సాహంగా ‘జెన్సన్.. జెన్సన్..’ అంటూ చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జెన్సన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నన్ను క్షమించి మళ్లీ నాపై నమ్మకం ఉంచినందుకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. ఈసారి నేను మరింత మెరుగైన సీఈవోగా పనిచేస్తాను’’ అని ఉద్యోగులతో అన్నారు. జెన్సన్ అద్భుతమైన మేధావి అని, ఆయన అమెరికా జాతీయ సంపద అని ట్రంప్ అన్నారు. ‘‘నేను ఎన్విడియా బోర్డు సభ్యులతో మాట్లాడాను. ఒకవేళ మనం జెన్సన్‌ను వదులుకుంటే చైనా, లేదా ఇతర ప్రత్యర్థి దేశాలు ఆయనకు ఎరవేసి లాగేసుకుంటాయి. అదే జరిగితే అమెరికాకు కోలుకోలేని నష్టం జరుగుతుంది. ఆయన్ను వదులుకోవడం మూర్ఖత్వం అవుతుందని వారికి నచ్చజెప్పాను’’ అని తెలిపారు. కాగా, ఎన్విడియా షేరు ధర పెరగడంతో ట్రంప్‌నకు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్లకు ఒక్క రోజులోనే 15మిలియన్ డాలర్లు(రూ.140కోట్లు) లాభం వచ్చాయి.
జెన్సన్‌ను చైనా బ్లాక్ మెయిల్ చేసే చాన్స్
జెన్సన్ పునర్నియామకంపై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది దేశ భద్రతకు పెనుముప్పు’’ అని హెచ్చరించారు. జాతీయ భద్రతకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తిని సొంత ప్రయోజనాల కోసం మళ్లీ సీఈవోగా నియమించేలా కంపెనీ బోర్డుపై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. రిపబ్లికన్ సెనెటర్లు పీట్ రికెట్స్, కెవిన్ క్రామర్ సహా పలువురు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. చైనా గూఢచారి అలిస్‌తో సంబంధాల నేపథ్యంలో చైనా ఆయన్ను బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉందన్నారు.