Share News

చైనా గూఢచారితో ఎన్విడియా సీఈవోకు వివాహేతర సంబంధం!

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:18 AM

తొమ్మిదేళ్ల వయసులో తైవాన్‌ నుంచి అనామకుడిగా అమెరికాకు వలస వెళ్లిన ఒక బాలుడు.. అక్కడ ఎన్నో కష్టాలుపడిపెరిగి పెద్దవాడై సెమీకండర్ల డిజైన్‌ కంపెనీని స్థాపించటంతోపాటు..

చైనా గూఢచారితో ఎన్విడియా సీఈవోకు వివాహేతర సంబంధం!

  • తప్పుచేశాను క్షమించండి.. సీఈవో జెన్సన్‌ ప్రకటన

  • చైనా మహిళతో వివాహేతర బంధంపై పరోక్ష అంగీకారం

  • ఆ మహిళ అలిస్‌ హువాంగ్‌ అని మీడియాలో కథనాలు

  • వీరి మధ్య సంబంధంపై అమెరికా భద్రతా సంస్థల దర్యాప్తు

  • అలిస్‌ చైనా గూఢచారి అని ఆరోపణలు.. అమెరికా ఆంక్షల్ని తప్పించి ఎన్విడియా చిప్‌లు చైనాకు పంపినట్లు అనుమానం

  • గూఢచర్యం ఆరోపణలను తోసిపుచ్చిన చైనా

న్యూయార్క్‌, నవంబరు 9: తొమ్మిదేళ్ల వయసులో తైవాన్‌ నుంచి అనామకుడిగా అమెరికాకు వలస వెళ్లిన ఒక బాలుడు.. అక్కడ ఎన్నో కష్టాలుపడిపెరిగి పెద్దవాడై సెమీకండర్ల డిజైన్‌ కంపెనీని స్థాపించటంతోపాటు..దానిని ప్రపంచంలోనే అతిపెద్ద (విలువ పరంగా) కంపెనీగా తీర్చిదిద్దాడు. ప్రపంచంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయుడిగా ఎదిగాడు. కానీ, అంతలోనే ఆయన బుద్ధి వక్రించింది. ఒక చైనా మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రపంచం ముందు నేడు దోషిగా నిలబడ్డారు. ఆయనే ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌... పైగా ఆ మహిళ చైనా గూఢచారి అని వార్తలు రావటం, జెన్సన్‌కు కూడా చైనా మూలాలు ఉండటంతో వీరి సంబంధం సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం విషయాన్ని జెన్సన్‌ పరోక్షంగా అంగీకరించారు. తన తప్పును ఒప్పుకుంటూ ఆయన ఎన్విడియా సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో క్షమాపణ చెప్పారు. లేఖలో ఆ మహిళ పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే, ఆ మహిళ పేరు అలిస్‌ హువాంగ్‌ అని, ఆమె చైనాకు చెందిన గూఢచారి అని అమెరికా భద్రతా సంస్థలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.


అలిస్‌పై నిఘాతో విషయం బట్టబయలు..

అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనాకు అమెరికా టెక్నాలజీ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీలో కీలక మైన చిప్‌లు కూడా ఉన్నాయి. ఏఐ చిప్‌ల తయారీలో ఎన్విడియా ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖులపై చైనా గూఢచర్యం చేసి, టెక్నాలజీని అక్రమంగా తరలించే అవకాశం ఉందన్న అనుమానంతో అమెరికా భద్రతా సంస్థలు నిఘా పెట్టాయి. ఆ క్రమంలో వారికి అలిస్‌ హువాంగ్‌పై అనుమానం వచ్చిందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌, ద న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థలు తెలిపాయి. ఆమె ఒక అమెరికా పౌరుడితో సన్నిహితంగా మెలుగుతోందని గుర్తించి దర్యాప్తు జరపగా.. ఆ వ్యక్తి జెన్సన్‌ అని తేలినట్లు వెల్లడించాయి. అలిస్‌ హువాంగ్‌ చైనా గూఢచారి అని అమెరికా భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. తైవాన్‌ రాజధాని తైపీలో 2024 జూన్‌లో జరిగిన టెక్నాలజీ ట్రేడ్‌ షో సందర్భంగా పలు సంస్థల అధినేతలతో కలిసి ఒక బార్‌లో జెన్సన్‌, అలిస్‌ మద్యం సేవిస్తున్న ఫొటో తొలిసారి బయటకు వచ్చింది. 2025 మేలో అదే నగరంలో నిర్వహించిన ఏఐ సరఫరాదారుల బిజినెస్‌ డిన్నర్‌ సందర్భంగా ఒక రెస్టారెంట్‌లో వీరిద్దరు కలిసి ఉన్న మరో ఫొటో బయటకు వచ్చింది. అయితే, అలిస్‌తో తనకు సాధారణ వ్యాపార సంబంధాలే ఉన్నాయని అప్పట్లో జెన్సన్‌ ప్రకటించారు. కానీ, వీరిమధ్య ‘రొమాంటిక్‌ రిలేషన్‌షి్‌ప’ ఉందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది.


ఎవరీ అలిస్‌ హువాంగ్‌?

చైనా జాతీయురాలైన అలిస్‌ మొదట జర్నలిస్టుగా పనిచేశారు. హునాన్‌ టీవీతోపాటు చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీలో రిపోర్టర్‌గా పనిచేశారు. 2023లో సింగపూర్‌లో స్థాపించిన డేటా సెంటర్‌ కంపెనీ మెగాస్పీడ్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. నిజానికి చైనాకు చెందిన 7రోడ్‌ సంస్థ సహకారంతో మెగాస్పీడ్‌ కంపెనీని ఏర్పాటు చేసింది ఆమేనని భావిస్తున్నారు. మెగాస్పీడ్‌ సంస్థను 2023లోనే స్విఫ్ట్‌ డేటా సంస్థకు విక్రయించారు. ఈ సంస్థ ఎన్విడియా నుంచి 2024 జూన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 4.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఏఐ చిప్‌లను కొనుగోలు చేసింది. ఈ చిప్‌లను చైనా కంపెనీలకు అందజేసినట్లు అనుమానాలున్నాయి. ఈ విధంగా ఆమె జెన్సన్‌తో వివాహేతర సంబంధం కొనసాగించి అమెరికా ఆంక్షలకు చిక్కకుండా విలువైన చిప్‌లను చైనాకు తరలించినట్లు భావిస్తున్నారు.

తప్పు చేశాను.. క్షమించండి..

విషయం బయట పడటంతో ఎన్విడియా ఉద్యోగులకు, తన కుటుంబ సభ్యులకు జెన్సన్‌ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు వారికి ఆదివారం లేఖ రాశారు. ‘నా భార్యకు నేను నమ్మకద్రోహం చేశాను. నా చర్యలు ఆమెతోపాటు నా పిల్లల హృదయాలను తీవ్రంగా గాయపర్చాయి. నేను చేసిన పనికి ప్రాయచ్చిత్తమే లేదు. మీ నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాను. నా చర్యలకు పూర్తి బాధ్యత నాదే. నేను దిగజారి ప్రవర్తించాను. అందుకు అందరికీ క్షమాపణ చెబుతున్నాను. మీ నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాను’ అని లేఖలో పేర్కొన్నారు. జెన్సన్‌ వివాహేతర సంబంధం ఆరోపణలపై ఎన్విడియా కంపెనీ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.


జెన్సన్‌కు ట్రంప్‌ మద్దతు

జెన్సన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పేస్‌ఎక్స్‌ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ తదితరులు మద్దతు ప్రకటించారు. ‘ఈ ఆరోపణల గురించి నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. జెన్సన్‌ మాత్రం చాలా మంచి వ్యక్తి. అమెరికాకు ఆయన ఎంతో సేవ చేశారు. కానీ, ఈ విషయంలో ఏం జరిగిందన్నది మీకెవరికీ తెలియదు’ అని మీడియాతో ట్రంప్‌ పేర్కొన్నారు. జెన్సన్‌కు తప్పుడు ఉద్దేశాలు ఉన్నట్లు తాను భావించటం లేదని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. మరోవైపు గూఢచర్య ఆరోపణలను చైనా తిరస్కరించింది. తమపై బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది.

Updated Date - Nov 10 , 2026 | 02:20 AM