అణు పరీక్షలతో మారణహోమం..!
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:54 AM
ప్రపంచంలో దేశాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జరుగుతున్న అణు పరీక్షలు కంటికి కనిపించని మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి..
1945-2017 మధ్య 40 లక్షల మంది మృత్యువాత
నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రపంచంలో దేశాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జరుగుతున్న అణు పరీక్షలు కంటికి కనిపించని మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి..! వివిధ దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకోవడా నికి నిర్వహిస్తున్న అణ్వాయుధ పరీక్షల వల్ల లక్షలాది మంది మృత్యువాత పడ్డారని తాజా నివేదిక వెల్లడించింది. 1945 నుంచి 2017 మధ్యకాలంలో వివిధ దేశాలు చేపట్టిన 2,400 అణుపరీక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమా రు 40 లక్షల మంది అకాల మరణం చెందినట్టు నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ (ఎన్‌పీఏ) నివేదిక అంచనా వేసింది. ఈ మరణాలకు ప్రధాన కారణం రేడియో ధార్మికత అని ఈ నివేదిక తెలిపింది. రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు ఎక్కువయ్యాయని, దీని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి దశాబ్దాల్లో ఉత్తర కొరియా మాత్రమే అణు పరీక్షలు నిర్వహించినప్పటికీ.. వీటితోపాటు వివిధ దేశాల గత పరీక్షల వల్ల ఏర్పడిన రేడియోధార్మికత.. ప్రజల ఆరోగ్యంపై నేటికీ ప్రభావం చూపిస్తోందని పేర్కొంది. గాలి, నేల, నీటిని కలుషితం చేసే అణు పరీక్షల వల్ల పర్యావరణంతోపాటు ప్రజారోగ్యానికీ తీవ్రనష్టం కలుగుతోందని, వీటిలో చాలారకాల జబ్బులు సంవత్సరాలు లేదా దశాబ్దాల తర్వాత బయటపడతాయని నివేదిక తెలిపింది.