సిందూర్ వేళ అణుముప్పు లేదు!
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:42 AM
ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌లో ఎలాంటి అణు ముప్పు జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రాస్సీ తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయం కోసమే
ఓ ఇంటర్వ్యూలో ఐఏఈఏ చీఫ్ గ్రాస్సీ
దావోస్, జనవరి 24: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌లో ఎలాంటి అణు ముప్పు జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రాస్సీ తెలిపారు. దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన గ్రాస్సీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అణ్వాయుధ నిల్వల భద్రత గురించి ఆందోళన వ్యక్తమైంది. కానీ, అలాంటి ముప్పేమీ మా దృష్టికి రాలేదు.’’ అని చెప్పారు. పాకిస్థాన్, చైనా, ఇరాన్, రష్యా, ఉత్తర కొరియాలు భూగర్భంలోని లోతైన ప్రాంతాల్లో అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాయంటూ.. కొన్ని మాసాల కిందట ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గ్రాస్సీ తోసిపుచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ పరమైనవేనని వ్యాఖ్యానించారు. ‘‘ఆ విధంగా పరీక్షలు జరిగినట్టు ఎలాంటి రికార్డులు లేవు. సహజంగా ఇలాంటి ప్రకటనలు రాజకీయ కోణంలోనే ఉంటాయి’’ అని అన్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని తాము కార్యకలాపాలు చేపట్టబోమని తెలిపారు. ఇప్పటి వరకు అణు పరీక్షలు ఎవరూ చేయలేదన్నారు. ‘‘మనం చూసింది డెలివరీ సాధనాల పరీక్ష, నిర్వహణ మాత్రమే. ఇది అణ్వాయుధాలకు భిన్నంగా ఉంటుంది’’ అని ఆయన వివరించారు.