Share News

భారత నౌకలన్నింటికీ పూర్తిగా అనుమతి రాలేదు

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:33 AM

హోర్ముజ్‌ జలసంధిలో భారత నౌకల రాకపోకలకు ఇంకా సంపూర్ణంగా అనుమతి రాలేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు.

భారత నౌకలన్నింటికీ పూర్తిగా అనుమతి రాలేదు

  • ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి: జైశంకర్‌

దుబాయ్‌/న్యూఢిల్లీ, మార్చి 16: హోర్ముజ్‌ జలసంధిలో భారత నౌకల రాకపోకలకు ఇంకా సంపూర్ణంగా అనుమతి రాలేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరుపుతున్నామని, ప్రస్తుతం రెండు భారత గ్యాస్‌ ట్యాంకర్లు జలసంధిని దాటేందుకు సహకరించిందని తెలిపారు. హోర్ముజ్‌ సమీపంలో మన నౌకలు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నాయని, వాటి కోసం ఇరాన్‌తో చర్చలు జరుపుతూనే ఉన్నామని వివరించారు. మరోవైపు, ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు ఎవరూ ఆ దేశ భూభాగ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించవద్దని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదేశించింది. ఎంబసీని సంప్రదించకుండా సరిహద్దులు దాటి ముందుకెళ్లే ప్రయత్నం చేయవద్దని సూచించింది. తమ అడ్వయిజరీని కచ్చితంగా పాటించాలని తేల్చిచెప్పింది.


1.jpg

19 మంది భారతీయుల అరెస్టుకు యూఏఈ ఆదేశం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే, కల్పిత వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం వాటిని తీవ్రంగా పరిగణించింది. అలాంటి నకిలీ వీడియోలను అన్‌లైన్‌లో పోస్టు చేస్తున్న వారిని గుర్తించి, అరెస్టు చేయాలని ఆదేశించింది. గత రెండు రోజుల్లో వివిధ దేశాలకు చెందిన 35 మందిని గుర్తించగా.. వారిలో 19 మంది భారతీయలు ఉన్నట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే వీడియోలను షేర్‌ చేస్తున్న వారిని యూఏఈ అధికారులు గుర్తించి, చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 03:34 AM