ఇరాన్‌లో పాలనా మార్పు కష్టమే!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:28 AM
యుద్ధం ద్వారా ఇరాన్‌లో పాలనా మార్పు సాధ్యం కాకపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఆ దేశంలో ఇస్లామిక్ విప్లవ ప్రభుత్వం కూలిపోవాలంటే ఇరాన్ ప్రజలే తిరుగుబాటు చేయాల్సి ఉంటుందన్నారు.
జెరూసలేం, మార్చి13: యుద్ధం ద్వారా ఇరాన్‌లో పాలనా మార్పు సాధ్యం కాకపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఆ దేశంలో ఇస్లామిక్ విప్లవ ప్రభుత్వం కూలిపోవాలంటే ఇరాన్ ప్రజలే తిరుగుబాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఇరాన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోయటానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాం. ఇరాన్ సైన్యం, బసీజ్ బలగాలను మా దాడులతో తీవ్రంగా దెబ్బతీసి ప్రతిపక్షాల ఉద్యమానికి అడ్డంకులు తొలగించాం. ఇరాన్ ప్రజలారా.. మీకు స్వాతంత్య్రం సంపాదించుకొనే గొప్ప అవకాశం వచ్చింది. మేము మీ వెంట ఉన్నాం. మీకు సహాయం చేస్తున్నాం. ఇక మార్పు మీ చేతుల్లోనే ఉంది’ అని స్పష్టంచేశారు. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయలేకపోవటం ఇజ్రాయెల్ వైఫల్యం కాదా? అన్న ప్రశ్నకు ఆయన.. ‘ఇజ్రాయెల్ మనుగడ సాగించాలంటే ఎప్పుడూ శక్తిమంతంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.