Share News

నేను చచ్చిపోయా.. కాఫీ కోసం!తన మరణవార్తలపై నెతన్యాహు వీడియో.. వేళ్లు లెక్కించుకోండని జోక్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:45 AM

తాను చనిపోయానంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలకు సమాధానంగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఒక వీడియోను విడుదల చేశారు. అందులో....

నేను చచ్చిపోయా.. కాఫీ కోసం!తన మరణవార్తలపై నెతన్యాహు వీడియో.. వేళ్లు లెక్కించుకోండని జోక్‌

టెహ్రాన్‌, టెల్‌ అవీవ్‌, మార్చి 15: తాను చనిపోయానంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలకు సమాధానంగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన ఒక కాఫీ షాప్‌లో కాఫీ ఆర్డర్‌ చేస్తూ కనపడ్డారు. కెమెరా వైపు చూస్తూ.. ‘‘నేను కాఫీ కోసం పడి చచ్చాను’’ అని హీబ్రూ బాషలో చెప్పారు. ‘‘మీకో విషయం తెలుసా.. నేను నా ప్రజలకోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. (యుద్ధసమయంలో) వారు ప్రవర్తిస్తున్న తీరు అద్భుతం’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. మార్చి 12నాటి తన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ వీడియో ఏఐ సాయంతో రూపొందించింది కాదని స్పష్టంగా తెలిసేలా.. తన రెండు చేతులూ చూపించి.. ‘‘నా వేళ్లను లెక్కపెట్టాలనుకుంటున్నారా? ఇక్కడ చూడొచ్చు.. ఇదుగో.. చూడండి.. చాలా బాగున్నాయి కదూ’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ ప్రజలందరూ బయటకు వెళ్లి కాస్త తాజా గాలి పీల్చుకోవాలని.. అదేసమయంలో, రక్షిత ప్రదేశాలకు సమీపంగా ఉండాలని, హోం ఫ్రంట్‌ కమాండ్‌ ఆదేశాలను తూచాతప్పకుండా పాటించాలని సూచించారు. ఆయన ఈ వీడియో విడుదల చేయడానికి ముందు.. నెతన్యాహు బతికి ఉన్నారో లేదో తమకు తెలియదని.. ఒకవేళ బతికి ఉంటే మాత్రం ఆయన్ను వెంటాడి చంపుతామని హెచ్చరిస్తూ ఐఆర్‌జీసీ ఒక ప్రకటన చేసింది. ‘‘నెతన్యాహు పరిస్థితేంటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆయన చనిపోయి ఉండొచ్చు. లేదా కుటుంబంతో సహా ఇజ్రాయెల్‌ నుంచి పారిపోయి ఉండొచ్చు. ఒకవేళ.. ఆ నేరగాడు, పిల్లలను చంపిన హంతకుడు.. నెతన్యాహు ఇంకా బతికే ఉంటే, ఆయన్ను వేటాడుతాం.’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Mar 16 , 2026 | 03:45 AM