ఉనికి కోసం ఇరాన్ పోరాటం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:37 AM
ఇరాన్ మిసైల్ సామర్థ్యాలను తాము ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా పేర్కొన్నారు. తన ఉనికి కోసం పోరాడే స్థితికి ఇరాన్ చేరుకుందని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి ఇరాన్‌పై మండిపడ్డారు. ఇరాన్ తన ఉనికిని కాపాడుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోందని అన్నారు. ఆ దేశ మిసైల్ సామర్థ్యాలను ద్వంసం చేశామని చెప్పారు. ఆ దేశ అణుకార్యక్రమాన్ని కూడా నామరూపాలు లేకుండా చేశామని చెప్పారు. దీంతో, ఊపిరాడక ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోందని అన్నారు.
‘మా కార్యక్రమం ఇంకా ముగియలేదు. కానీ మేము అద్భుత విజయాలు సాధించామన్న విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. మమ్మల్ని చుట్టుముట్టి గొంతును బిగించాలని ఇరాన్ చూసింది. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్‌బొల్లా, సిరియాలో అసద్, ఇరాక్‌లో వివిధ మిలిటెంట్లు, యెమన్‌లో హౌతీలతో చుట్టుముట్టి ఊపిరాడకుండా చేయాలని చూసింది. నామరూపాలు లేకుండా చేయాలని అనుకుంది. ఇప్పుడు వారే తమ ఉనికి కోసం పోరాడుతున్నారు’ అని నెతన్యాహు పేర్కొన్నారు. యూఎస్-ఇరాన్ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిసిన నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఇరాన్‌తో చర్చలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సానుకూల ధోరణితోనే చర్చలకు వచ్చామన్నారు. సర్దుబాటు ధోరణిని కూడా ప్రదర్శించామని చెప్పారు. కానీ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోమని ఇరాన్ తమకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని అన్నారు.
అసమంజసమైన అమెరికా డిమాండ్ల కారణంగానే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ అధికారిక వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. తాము సూచించిన అనేక ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించిందని పేర్కొంది. ఫలితంగా చర్చలు అర్థాంతరంగా ముగిశాయని తెలిపింది.