పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే దాడి
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:01 AM
ఇరాన్‌పై అమెరికాతో కలిసి దాడి చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహ్యూ వీడియో సందేశం విడుదల చేశారు.
నెతన్యాహూ ప్రకటన
టెల్ అవీవ్, ఫిబ్రవరి 28: ఇరాన్‌పై అమెరికాతో కలిసి దాడి చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహ్యూ వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్‌లో ఉగ్రవాద పాలకుల రూపంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని రూపుమాపడానికే దాడి చేయాల్సి వచ్చిందని ప్రకటించారు. తొలుత ‘గ్రేట్ ఫ్రెండ్’, ‘చరిత్రాత్మక నాయకుడు’ ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. గత 47 ఏళ్లుగా అయోతొల్లా ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్‌ల చావును కోరుతోందని, పలువుర్ని చంపి రక్తాన్ని కళ్ల చూసిందని ఆరోపించారు. ’’ఈ హంతక, ఉగ్రవాద పాలకుల చేతిలో అణ్వాయుధాలు ఉండకూడదు. ఉంటే అది మానవాళికే ముప్పుగా పరిణమిస్తుంది’’ అన పేర్కొన్నారు. అణ్వాయుధాలను తయారు చేయకుండా నిరోధించేందుకు అమెరికా రెండు విడతలుగా చర్చలు జరిపినా ఫలించలేదని తెలిపారు. అందువల్ల ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును చేతుల్లోకి తీసుకునేలా ఉమ్మడిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ యుద్ధం పాలకులపైనే తప్ప, ఇరాన్ ప్రజలపై కాదని స్పష్టం చేశారు. నియంతృత్వ కాడిని వదిలించుకొని శాంతి, స్వేచ్ఛాయుత ఇరాన్‌ను నిర్మించుకోవాలని దేశంలోని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ (ఘర్జించే సింహం) పేరుతో చేపట్టిన ఈ దాడి సందర్భంగా సహనంతో మెలగాలని, హోం ఫ్రంట్ కమాండ్ ఇచ్చే మార్గదర్శకాలను అమలు చేయాలని ఇజ్రాయెల్ వాసులను కోరారు.