Share News

నేపాల్‌ ప్రధానిగా ర్యాపర్‌!

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:27 AM

హిమాలయ దేశం నేపాల్‌లో ఓ కొత్త రాజకీయ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ....

నేపాల్‌ ప్రధానిగా ర్యాపర్‌!

  • పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీ ఆర్‌ఎస్పీ ఘనవిజయం!

  • 275 సీట్లలో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు

  • శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 100 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఆర్‌ఎస్‌పీ

  • కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల్ని తిరస్కరించిన యువత

  • ఒంటిచేత్తో గెలిపించిన ప్రధాని అభ్యర్థి బాలెన్‌ షా

  • 35 ఏళ్లకే నేపాల్‌ ప్రధాని స్థాయికి..

  • భారతదేశ వ్యతిరేకిగా బాలెన్‌ షాకు పేరు

కాట్మాండు, మార్చి6: హిమాలయ దేశం నేపాల్‌లో ఓ కొత్త రాజకీయ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) బంపర్‌ మెజారిటీతో ఘనవిజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. నేపాల్‌ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలు ఉండగా, 165 సీట్లకు గురువారం ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కడపటి వార్తలు అందే సమయానికి ఆర్‌ఎస్‌పీ 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ పార్టీ 2022లోనే ఏర్పడింది. రవి లమిచ్ఛేన్‌ ఈ పార్టీని స్థాపించారు. కాట్మాండు మాజీ మేయర్‌ బాలేంద్ర షా ఈ ఏడాది జనవరి 18న ఈ పార్టీలో చేరి, పార్టీ ప్రధాని అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. నేపాల్‌కు నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (సీపీఎన్‌-యూఎంఎల్‌) అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీని ఆయనకు కంచుకోట వంటి ఝపా-5 నియోజకవర్గంలోనే బాలెన్‌ షా చిత్తుగా ఓడించారు.


కొట్టుకుపోయిన ప్రధాన పార్టీలు..

నేపాల్‌లో రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా గత ఏడాది సెప్టెంబర్‌లో జెన్‌జీ యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రెండురోజుల పాటు దేశం మొత్తం హింసాత్మక నిరసనలతో అట్టుడికిపోయింది. దీంతో నేపాలీ కాంగ్రెస్‌, సీపీఎన్‌-యూఎంఎల్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల అనంతరం గురువారం పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సంప్రదాయ పార్టీలను నేపాలీ ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. కడపటి వార్తలు అందే సమయానికి ఆర్‌ఎస్‌పీ మూడు సీట్లలో గెలిచి, 104 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. నేపాలీ కాంగ్రెస్‌ రెండుచోట్ల గెలిచి, 13 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సీపీఎన్‌-యూఎంఎల్‌ పది చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. నేపాలీ కమ్యూనిస్టు పార్టీ ఒక చోట గెలిచి ఆరుచోట్ల లీడ్‌లో ఉంది. శ్రమ్‌సంస్కృతి పార్టీ ఆరు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్‌ఎస్‌పీ ప్రభంజనంలో ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో 275 సీట్లు ఉంటాయి. అయితే, దేశంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగే ఎంపీ సీట్లు 165 మాత్రమే. ఈ సీట్లకు ప్రజలు ఎంపీలను నేరుగా ఎన్నుకుంటారు. మిగతా 110 సీట్లను అనుపాత ప్రాతినిధ్య పద్ధతిలో కేటాయిస్తారు. అంటే పోలింగ్‌ కేంద్రంలో ప్రతి ఓటరుకు రెండు బ్యాలెట్‌ పేపర్లు ఇస్తారు. ఒకటి అభ్యర్థులకు సంబంధించింది. ఈ బ్యాలెట్‌లోని అభ్యర్థుల్లో నచ్చిన వ్యక్తికి ఓటరు ఓటు వేస్తారు. మరొక బ్యాలెట్‌ పార్టీలకు సంబంఽధించింది. దీనిలో ఉండే పార్టీలలో ఓటరు ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఈ 110 సీట్లను పంచుతారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 165 సీట్లలో 3,400 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రపోర్షనేట్‌ ఓటింగ్‌ జరిగిన 110 సీట్లలో 3,135 మంది పోటీలో ఉన్నారు. ఈ 110 సీట్లకు సంబంఽధించిన ఓట్ల లెక్కింపునకు మరో రెండుమూడు రోజుల సమయం పడుతుంది. అయితే, ఆర్‌ఎ్‌సపీ ఘనవిజయం దిశగా దూసుకుపోతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబురాల్లో మునిగిపోయారు.


అవినీతిపై పాటలతోనే బాలెన్‌ షా పోరాటం

పాలకుల అవినీతి, పెరిగిపోయిన పేదరికం, రాజకీయ అస్థిరతతో కునారిల్లిన మన పొరుగుదేశం నేపాల్‌కు ఇప్పుడు ఓ 35 ఏళ్ల యువకుడు ఆశాకిరణంలా మారాడు. ముక్కుసూటితనం, దూకుడైన పనితనంతో ఇప్పటికే నేపాల్‌ యువత మనసు దోచుకున్న అతడు.. త్వరలో ఆ దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి కొత్త చరిత్ర లిఖించబోతున్నారు. ఆయనే బాలేంద్ర షా. నేపాల్‌లో ఆయనను అందరు బాలెన్‌ షా అని పిలుచుకుంటారు. శుక్రవారం వెల్లడైన సాధారణ ఎన్నికల ఫలితాల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌ఎస్‌పీ ఘనవిజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి బాలెన్‌ షానే కావటంతో దేశ పాలనా పగ్గాలు చేపట్టం ఖాయంగా మారింది. బాలెన్‌ షా 1990, ఏప్రిల్‌ 27న కాట్మాండులోని నరదేవిలో జన్మించారు. ఆయన మధేసి సామాజికవర్గానికి చెందినవారు. సంగీతకారుడి (ర్యాపర్‌)గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. తన పాటల్లో నేపాల్‌లోని రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో పేరుకుపోయిన అవినీతిని ఎండగట్టేవారు. అలా నేపాల్‌ యువత (జెన్‌జీ)లో విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నారు. 2022లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. కాట్మాండు నగర మేయర్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి సంచలనం సృష్టించారు. నాలుగేళ్లపాటు మేయర్‌ పదవిలో కొనసాగిన ఆయన సంస్కరణలతో కాట్మాండు నగర రూపురేఖలనే మార్చేశారు. గతేడాది జెన్‌జీల ఆందోళనతో ప్రభుత్వం కూలిపోయినప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపేందుకు ముందుకు రావాలని బాలెన్‌ షాను యువత కోరింది. కానీ, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రధాని పదవి చేపడతానని తేల్చి చెప్పారు. 2022లో ప్రారంభమైన ఆర్‌ఎ్‌సపీలో ఈ ఏడాది జనవరి 18న చేరిన ఆయన.. 2నెలలు తిరక్కుండానే కొత్త పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే, బాలెన్‌ షా భారత వ్యతిరేకిగా ముద్ర పడ్డారు. తమదేశంలో భారతదేశ ప్రభావం, ఆధిపత్యం ఉండరాదని గతంలో అన్నారు. నేపాల్‌లో బాలీవుడ్‌ సినిమాలను నిషేఽధించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 07 , 2026 | 04:28 AM