9 రోజుల తర్వాత.. సొరంగం నుంచి సజీవంగా!
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:06 AM
నేపాల్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఓ జలవిద్యుత్తు ప్రాజెక్టు సొరంగం నుంచి 9 రోజుల తర్వాత ఇద్దరు కార్మికులను ప్రాణాలతో సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి.
‘త్రిశూలి ప్రాజెక్టు’ టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులను కాపాడిన సహాయక బృందాలు
కాఠ్మాండు, సెప్టెంబరు 4: నేపాల్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఓ జలవిద్యుత్తు ప్రాజెక్టు సొరంగం నుంచి 9 రోజుల తర్వాత ఇద్దరు కార్మికులను ప్రాణాలతో సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి. భోటెకోషి నది ఉప్పొంగడంతో త్రిశూలి 3ఏ జలవిద్యుత్తు ప్రాజెక్టు సొరంగంలో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వీరిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే సొరంగం లోపలి నుంచి చిన్నగా అరుపులు వినిపించాయి. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సొరంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బంది ఇద్దరిని చాకచక్యంగా ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాయి. బాధితులను ప్రాజెక్టు మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్, మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ సాహ్‌గా గుర్తించామని ఆర్మీ అధికారులు తెలిపారు. సొరంగంలోని 170 మీటర్ల లోతు నుంచి వీరిని కాపాడామన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ఇది పునర్జన్మ అని.. ఈ 9 రోజులు దేవుడిపై భారం వేసి ‘హరే కృష్ణ’ మంత్రాన్ని జపిస్తూ గడిపానని చెప్పారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన మరో 40మంది సిబ్బంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. వరద బీభత్సం కారణంగా నేపాల్‌లో 600మంది చిన్నారులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య 1,282కి పెరిగింది. నేపాల్‌లో గల్లంతైనవారిలో 275మంది భారతీయులున్నారు.