నేపాల్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల రద్దు
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:59 AM
నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర(బాలెన్) షా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలను నిషేధించారు.
ప్రధాని బాలేంద్ర షా సంచలన నిర్ణయం
కాఠ్మాడూ, మార్చి 30: నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర(బాలెన్) షా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలను నిషేధించారు. రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఇక నుంచి విశ్వవిద్యాలయాల్లో పని చేయడానికి వీల్లేదు. వర్సిటీల్లో 90 రోజుల్లో విద్యార్థుల మండలిని ఏర్పాటు చేస్తారు. తన పాటల ద్వారా విద్యార్థులకు, యువతకు దగ్గరై, వారి ఉద్యమం కారణంగానే నాయకుడిగా ఎదిగి, 35 ఏళ్లకే ప్రధాని పదవిని అధిష్ఠించిన బాలెన్ ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు పనేంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు అనుబంధ విద్యార్థి సంఘాల కారణంగా విశ్వవిద్యాలయాల్లో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నేతృత్వంలో గెలిచి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన బాలెన్ 48 గంటల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జెన్-జీ ఉద్యమ సమయంలో యువత మీద కాల్పులు జరిపి పలువురి మరణానికి కారణమైన ఆరోపణలపై మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలిని అరెస్టు చేశారు. కార్మిక సంఘాలు పార్టీలకు అనుబంధంగా ఉండరాదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 27మందికి సంబంధించి వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున ఉద్యోగాలు కల్పించారు.