Share News

నేపాల్‌ విలయానికి 4 రోజులు ఆశలు శూన్యం

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:40 AM

జల విలయంతో అతలాకుతలమైన నేపాల్‌ శోకసంద్రంగా మారిపోయింది. వరద ముంచెత్తి నాలుగు రోజులైనా ఇంకా 2,400 మందికిపైగా జాడ దొరకడం లేదు. దీనితో గల్లంతైనవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.

నేపాల్‌ విలయానికి 4 రోజులు ఆశలు శూన్యం

  • ఇంకా దొరకని 2400 మంది ఆచూకీ

  • వారిలో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈవో లక్ష్మీనాథ్‌

  • జాడలేని 77 మంది ఈశా బృందం

  • ఇప్పటిదాకా 675 మృతదేహాలు వెలికితీత

  • భారతీయులను రక్షించడంపై ప్రత్యేక దృష్టిపెట్టండి

  • ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలకు ఖర్గే లేఖ

ఖాఠ్మండూ/న్యూఢిల్లీ, ఆగస్టు 29: జల విలయంతో అతలాకుతలమైన నేపాల్‌ శోకసంద్రంగా మారిపోయింది. వరద ముంచెత్తి నాలుగు రోజులైనా ఇంకా 2,400 మందికిపైగా జాడ దొరకడం లేదు. దీనితో గల్లంతైనవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వెలికి తీసిన మృతదేహాల్లో తమవారు ఎవరైనా ఉన్నారా అంటూ ఆస్పత్రుల వద్ద వెతుకుతున్నారు. మరికొందరు బురద, శిథిలాల్లో తమవారి జాడ ఏమైనా దొరుకుతుందేమోనని గాలిస్తున్నారు. కుప్పకూలిన ఇళ్లను చూసి సర్వం కోల్పోయిన ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఘటన జరిగి నాలుగు రోజులైనా గల్లంతైన వారిలో చాలా మంది ఆచూకీ లభించకపోవడంతో.. వారు సజీవంగా ఉండవచ్చనే ఆశలు సన్నగిల్లుతున్నాయి.


ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు

మరోవైపు వర్షాలు కురుస్తుండటం, అంతా బురదతో నిండిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. నది పొడవునా ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలు బయటపడుతున్నాయి. శనివారం సాయంత్రం వరకు 675 మృతదేహాలను వెలికితీశామని నేపాల్‌ అధికారులు ప్రకటించారు. అయితే మృతదేహాలు కుళ్లిపోయి ఉండటంతో పోలీసులు వాటిని ఆయా ప్రాంతాల్లోనే ఖననం చేస్తున్నారు. మృతదేహాల ఫొటోలు, డీఎన్‌ఏ గుర్తింపు కోసం శరీర భాగాల శాంపిళ్లను తీసి భద్రపరుస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత.. గల్లంతైన వారి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో పోల్చి, వివరాలను అందజేస్తామని అధికారులు తెలిపారు. 7 వేల మంది సైనికులు సహా 14 వేల మందితో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. వరద పోటెత్తిన ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన, కొండలు, అడవుల్లో చిక్కుకున్న 4,500 మందిని ఇప్పటివరకు రక్షించామని నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ వెల్లడించారు. ఇక అప్పర్‌ త్రిశూలి జలవిద్యుత్‌ కేంద్రం సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బురదతో నిండిపోయిన ఆ సొరంగంలోంచి ఇప్పటికే 350 మందిని రక్షించగా, ఇంకా వంద మందివరకు లోపలే చిక్కుకుని ఉన్నారు. మరికొందరు సొరంగం బయట ప్రాజెక్టు ప్రాంతంలో పనిచేస్తూ కొట్టుకుపోయారు. భారత్‌ నుంచి టన్నెల్‌ రెస్క్యూ నిపుణులు, వైద్య సిబ్బందితో కూడిన 11 మంది బృందం.. శనివారం నేపాల్‌ చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది.


సర్వం బురదలోనే..

భోటేకోషి నది వెంట 8జిల్లాల పరిధిలో పట్టణాలు, గ్రామాల్లో తీవ్రంగా నష్టం జరిగింది. ముఖ్యంగా మధ్యనేపాల్‌లోని రసువా, త్రిశూలి ప్రాంతాల్లో విధ్వంసం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు, నీరు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు కొన్ని అడుగుల మేర బురదలో కూరుకుపోయి కనిపిస్తున్నాయి. వాహనాలు, వస్తువులు, ఇతర సామగ్రిలో చాలా వరకు నీటిలో కొట్టుకుపోయాయి, బురద కింద కూరుకుని దెబ్బతిన్నాయి. వరదల సమయంలో ఎత్తయిన ప్రాంతాలకు, అడవుల్లోకి వెళ్లిపోయిన వారంతా.. తిరిగి వచ్చి తమ ఇళ్లను చూసుకుని భోరుమంటున్నారు.

భారీ వర్షాలు.. మరోసారి వరద ముప్పు

శుక్ర, శనివారాల్లో భోటేకోషి నదీ వ్యవస్థ పరిధిలో గణనీయ స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీనితో నదిలో నీటి మట్టం పెరుగుతోంది. దీనితో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. మరోవైపు ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ‘హై అలర్ట్‌’ ప్రకటించారు. మరోవైపు ఎగువన మంచు కొండలు విరిగిపడి ఏర్పడిన సరస్సులు కూడా ఎప్పుడైనా తెగిపోయి.. వరద ముంచెత్తవచ్చని చైనా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది.

భారతీయులపై ప్రత్యేక దృష్టిపెట్టండి: ఖర్గే

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించి, తిరిగి రప్పించడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శనివారం వారికి లేఖ రాశారు. ఈ విపత్తును మానవతా వాదంతో పరిష్కరించాలని, అవసరమైతే మన దేశ విపత్తు నిర్వహణ దళాలను పంపాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో నేపాల్‌కు అండగా నిలవాలని కోరారు. మరోవైపు, నేపాల్‌ వరదల్లో చిక్కుకుపోయిన 88మంది భారతీయులను కాపాడినట్లు, ఇంకా 287మంది ఆచూకీ గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. నేపాల్‌లోని వరదల్లో గల్లంతైన వారి మృతదేహాలు దిగువన ఉన్న యూపీ, బిహార్‌లలోకి కొట్టుకువస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో గండక్‌, బుర్హాగండక్‌ నదుల్లో ఏడు మృతదేహాలను గుర్తించారు. ఆ దేహాల ఫొటోలు, ఇతర వివరాలను నేపాల్‌ ప్రభుత్వానికి అందించనున్నట్టు పోలీసులు తెలిపారు.


కొట్టుకొచ్చిన లాకర్లో డబ్బు కొట్టేసిన జనం..

నేపాల్‌లోని రసువా ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదల్లో ఒక బ్యాంకు లాకర్‌ కొట్టుకుపోయి.. బెల్ఖుఖోలా ప్రాంతంలో త్రిశూలి నది ఒడ్డుకు చేరింది. అది గమనించిన స్థానికులు.. లాకర్‌ను పగలగొట్టి సొమ్మంతా తీసేసుకున్నారు. దీనిపై సమాచారం అందిన పోలీసులు.. విచారణ జరిపి 29 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 92 లక్షల నేపాలీ రూపాయలు (రూ.57 లక్షలు) రికవరీ చేశారు.

నేపాల్‌లో చిక్కుకుపోయిన 68 మంది ఆంధ్రులు

57 మంది సురక్షితం..11 మంది గల్లంతు

నేపాల్‌ వరదల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి నేపాల్‌లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఫోన్‌ నంబర్లు 011-23384016, 23387089, వాట్సాప్‌ నంబరు 9059824101లో కూడా సంప్రదించవచ్చని ఏపీ భవన్‌ అధికారులు తెలిపారు. ఏపీ నుంచి 68 మంది నేపాల్‌, మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు. వీరిలో ఇప్పటికే 38 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నేపాల్‌, చైనాల్లో మరో 19 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. మరో 11 మంది జాడ తెలియాల్సి ఉందన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 05:42 AM