Share News

నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:35 AM

హిమాలయ దేశం నేపాల్‌ మళ్లీ ఆకస్మిక వరదలతో వణికిపోయింది. గూర్ఖా జిల్లాలో బుధి గండకి నదిలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా వరద పోటెత్తటంతో ప్రజలు ప్రాణాలు..

నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం

  • బుధి గండకి నదిలో ఆదివారం ఉదయం ఆకస్మిక వరద

  • కొట్టుకుపోయిన 35 ఇళ్లు, 10 మంది గల్లంతు

కాఠ్మాండు, అక్టోబరు 11: హిమాలయ దేశం నేపాల్‌ మళ్లీ ఆకస్మిక వరదలతో వణికిపోయింది. గూర్ఖా జిల్లాలో బుధి గండకి నదిలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా వరద పోటెత్తటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండలపైకి పరుగులు తీశారు. బురదతో నిండిన భారీ వరద ప్రవాహానికి సిల్లేరి, పైయూకా, జగత్‌ గ్రామాల్లో 35 ఇళ్లు కొట్టుకుపోయాయి. చుమ్నుబ్రి-6 మున్సిపాలిటీలో ఒక తీగల వంతెన తెగిపోయింది. ఒక జలవిద్యుత్‌ కేంద్రం తీవ్రంగా దెబ్బ తిన్నది. ఈ ఆకస్మిక వరద బీభత్సానికి 10 మంది గల్లంతయ్యారు. 50 మందిని నేపాల్‌ సైన్యం కాపాడింది. గత ఆగస్టులో మాదిరిగానే ఆదివారం కూడా ఎలాంటి వర్షాలు లేకుండానే ఆకస్మిక వరదలు సంభవించాయి. టిబెట్‌ సరిహద్దు నుంచి దక్షిణ దిశగా ప్రవహించి త్రిశూలీ నదిలో కలిసే బుధి గండకి నదిలో ఉదయం 6.30 గంటలకు వరద ప్రవాహ ఉధృతి మొదలైంది. ఆ సమయంలో నదిలో 3.66 మీటర్ల లోతు ప్రవాహమే ఉంది. ఉదయం 8.40 గంటలక ప్రవాహం 8.43 మీటర్ల ఎత్తుకు చేరింది. నది ఎగువ ప్రాంతంలో కృత్రిమంగా ఏర్పడిన జలాశయం తెగటం వల్లే ఈ వరదలు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆగస్టులో వరదలకు కారణమైన భోటేకోషీ నది కూడా త్రిశూలీ నది ఉపనదే. కాగా,ఆగస్టు 26న భోటేకోషీ నదిలో సంభవించిన ఆకస్మిక వరదలతో 1,457 మంది మరణించారు. 5,000 మందికిపైగా గల్లంతయ్యారు.

Updated Date - Oct 12 , 2026 | 04:36 AM