Share News

భూమి దిశగా నాసా అబ్జర్వేటరీ

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:07 AM

అంతరిక్షంలో జరిగే భారీ కాస్మిక్‌ పేలుళ్లను నమోదు చేయటానికి నాసా గత 21 ఏళ్లుగా ఉపయోగిస్తున్న నీల్‌ గెరెల్స్‌ స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ నియంత్రణ కోల్పోయి భూమి దిశగా దూసుకొస్తోంది.

భూమి దిశగా నాసా అబ్జర్వేటరీ

  • 21 ఏళ్లలో రెండు వేల కాస్మిక్‌ పేలుళ్లను నమోదు చేసిన స్విఫ్ట్‌

  • ఈ ఏడాది చివరకు భూమి వాతావరణంలోకి వచ్చి మండిపోయే అవకాశం

  • స్విఫ్ట్‌ను కాపాడుకునే యత్నాల్లో నాసా..

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 12: అంతరిక్షంలో జరిగే భారీ కాస్మిక్‌ పేలుళ్లను నమోదు చేయటానికి నాసా గత 21 ఏళ్లుగా ఉపయోగిస్తున్న నీల్‌ గెరెల్స్‌ స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ నియంత్రణ కోల్పోయి భూమి దిశగా దూసుకొస్తోంది. బుధవారం నుంచి దానికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసి.. దాని గమనాన్ని నాసా పరిశీలిస్తోంది. స్విఫ్ట్‌ అబ్జర్వేటరీని నాసా 2004లో ప్రయోగించింది. కృష్ణబిలాల పుట్టుక, నక్షత్రాల మరణాలను వివరించే గామా కిరణాల పేలుళ్లను రికార్డు చేసే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు. అంతరిక్షంలోనే అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు ఇవి. బరస్ట్‌ అలర్ట్‌ టెలిస్కోప్‌, ఎక్స్‌రే, అతినీలలోహిత, ఆప్టికల్‌ పరికరాల సాయంతో స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ గామా పేలుళ్లపై వివరాలను నాసాకు ఎప్పటికప్పుడు అందజేస్తోంది. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా పేలుళ్లను ఇది నమోదు చేసింది. దీనిద్వారా ఖగోళ భౌతికశాస్త్రం పరిశోధనలు కొత్త పుంతలు తొక్కాయి. కాగా, 2019 డిసెంబరులో ప్రారంభమైన ‘సోలార్‌ సైకిల్‌-25’ కారణంగా భూమి పైపొర వాతావరణం విపరీతంగా వేడెక్కి.. దాని ప్రభావం స్విఫ్ట్‌ మీద పడింది (సగటున ప్రతి 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పులను సోలార్‌ సైకిల్‌ అంటారు). భూమికి 585 కి.మీ.ల ఎత్తులో ఉండాల్సిన స్విఫ్ట్‌ క్రమంగా దిగువకు జారుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 400 కి.మీ.ల ఎత్తులోకి వచ్చింది. ఇలాగే కొనసాగితే, ఈ ఏడాది చివరికి స్విఫ్ట్‌ భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూ వాతావరణంతో ఘర్షణ కారణంగా స్విఫ్ట్‌ మండిపోతుందని, కాబట్టి, దాంతో తలెత్తే ప్రమాదం ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, దీనిని ఇక్కడితోనే వదిలిపెట్టాలని నాసా భావించటం లేదు. స్విఫ్ట్‌ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. అమెరికాకే చెందిన క్యాటలిస్ట్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థతో కలిసి ఈ ఏడాది జూన్‌లో.. స్విఫ్ట్‌ను భూమి నుంచి 600 కి.మీ.ల స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దాదాపు రూ.300 కోట్లు వ్యయం అయ్యే ఈ ప్రయోగం విజయవంతమైతే.. అంతరిక్ష పరిశోధనల్లో ఓ కొత్త అధ్యాయం మొదలవుతుందని, స్విఫ్ట్‌ మరో పదేళ్లపాటు సేవలు అందిస్తుందని నాసా భావిస్తోంది.

Updated Date - Feb 13 , 2026 | 06:07 AM