సునీతా విలియమ్స్ రోదసి యాత్ర.. ప్రాణాంతక వైఫల్యమే!
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:24 AM
రెండేళ్ల క్రితం సునీతా విలియమ్స్, విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక స్టార్‌లైనర్ అత్యంత తీవ్రమైన సాంకేతిక వైఫల్యాలకు లోనైందని నాసా తాజాగా ప్రకటించింది.
అంగీకరించిన నాసా.. నివేదిక విడుదల
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: రెండేళ్ల క్రితం సునీతా విలియమ్స్, విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక స్టార్‌లైనర్ అత్యంత తీవ్రమైన సాంకేతిక వైఫల్యాలకు లోనైందని నాసా తాజాగా ప్రకటించింది. ఆ ఘటనను టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. 2003లో భారత మూలాలున్న కల్పనాచావ్లాతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములను బలిగొన్న కొలంబియా ప్రమాదం కూడా టైప్-ఏ ఘటనే గమనార్హం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్) చేరుకోవటానికి 2024 జూన్ 5వ తేదీన స్టార్‌లైనర్‌లో సునీత, విల్మోర్ బయల్దేరిన విషయం తెలిసిందే. అక్కడ 8-14 రోజులు ఉండి తిరిగి భూమి మీదకు రావాల్సిన వారి ప్రయాణ షెడ్యూల్.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాల వల్ల దాదాపు ఏడాది వాయిదా పడింది. అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించిన ఈ ఘటనపై గురువారం నాసా 311 పేజీల నివేదికను విడుదల చేసింది. స్టార్‌లైనర్ నింగిలోకి దూసుకెళ్లిన వెంటనే దానిని ముందుకు నడిపించే ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్యలు మొదలయ్యాయని పేర్కొంది. ఐఎ్‌సఎ్‌సకు వ్యోమనౌక చేరుకునే సమయానికి ఐదు థ్రస్టర్లు లేదా మినీ ఇంజిన్లు పని చేయటం నిలిచిపోయాయని, హీలియం లీకేజీ మొదలైందని వెల్లడించింది. ఏదో రకంగా వ్యోమనౌకను ఐఎ్‌సఎ్‌సతో అనుసంధానించగలిగినా, స్టార్‌లైనర్ మరమ్మతులకు చాలా సమయం పట్టిందని తెలిపింది. మొత్తమ్మీద, తిరుగు ప్రయాణానికి స్టార్‌లైనర్ సిద్ధమైనా, వ్యోమగాముల ప్రాణాలను రిస్క్‌లో పెట్టకుండా.. ఆ వ్యోమనౌకను ఖాళీగానే 2024 సెప్టెంబరులో భూమి మీదకు సురక్షితంగా తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన సునీత, విల్మోర్ల తిరుగు ప్రయాణం 2025 మార్చిలోగానీ సాధ్యపడలేదు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో వారిని తిరిగి తీసుకొచ్చారు. కాగా, స్టార్‌లైనర్ వైఫల్యంతో 20 కోట్ల డాలర్ల (రూ.1820 కోట్ల) నష్టం వాటిల్లిందని నాసా నివేదిక వెల్లడించింది. స్టార్‌లైనర్‌ను రూపొందించిన కంపెనీ బోయింగ్‌ను నాసా తీవ్రంగా ఆక్షేపించింది. షెడ్యూల్‌లోగా ప్రయోగం జరగాలన్న అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, రక్షణ నిబంధనల్ని గాలికి వదిలేసిందని విమర్శించింది.