ఇరాన్ ప్రజలకు మొస్సాద్ వల
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:55 AM
యుద్ధంలో త్వరగా గెలవాలంటే శత్రువుపై దాడులతోనే సరిపెట్టకుండా.. శత్రుదేశంలో మనకు సాయం చేసేవారెవరో గుర్తించి, వారి సాయంతో...
న్యూఢిల్లీ, మార్చి 20: యుద్ధంలో త్వరగా గెలవాలంటే శత్రువుపై దాడులతోనే సరిపెట్టకుండా.. శత్రుదేశంలో మనకు సాయం చేసేవారెవరో గుర్తించి, వారి సాయంతో ఆ దేశంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేది యుద్ధనీతి! ఇజ్రాయెల్ అక్షరాలా దాన్నే పాటిస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోని కీలక లక్ష్యాలపై దాడులు చేస్తుండగా.. మరోవైపు, ఖమేని ప్రభుత్వాన్ని కూల్చడంలోతమకు సహకరించే ఇరానియన్లను గుర్తించేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగింది. ఇందుకోసం.. టెలిగ్రామ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటివాటిలో పర్షియన్ చానళ్లను నడుపుతూ, ‘మెరుగైన భవిష్యత్తు’ను ఎరగా వేసి ఇరాన్ పౌరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘ఇరాన్‌లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో మీరే మాకు నివేదికలు పంపాలి. విజయం వరకూ మేం మీతోనే ఉంటాం’’ అంటూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. డిసెంబరులో ఇరాన్‌లో చెలరేగిన ఆందోళనలను అణచివేసే క్రమంలో ఖమేనీ ప్రభుత్వం 36వేల మందిని నిరసనకారులను చంపేసినట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ ప్రభుత్వం మీద ఆ దేశ ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహాన్ని మరింతగా రగిల్చి, మంట రాజేసేందుకు మొస్సాద్ ఈ చానళ్లను ఉపయోగించుకుంటోంది. మొస్సాద్ డిసెంబరు 24వ తేదీన టెలిగ్రామ్‌లో.. పర్షియన్ భాషలో ఒక చానల్‌ను ప్రారంభించింది. ఆ టెలిగ్రామ్ చానల్ లింకు మొస్సాద్ అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉండడం గమనార్హం. ‘‘స్వాగతం. మీరు ఇక్కడిదాకా వచ్చారంటే.. మాతో టచ్‌లో ఉండాలనుకుంటున్నారన్నమాటే. మనం కలిసిపనిచేద్దాం’’ అనే సందేశం కూడా అక్కడ పర్షియన్ భాషలో ఉంటుంది.