Share News

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా చనిపోయారని వింటున్నా

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:46 AM

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారు గానీ.. బాగా దెబ్బతిన్నారు’ అని 2-3 రోజుల క్రితం అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా చనిపోయారని వింటున్నా

‘ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారు గానీ.. బాగా దెబ్బతిన్నారు’ అని 2-3 రోజుల క్రితం అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా మాట మార్చారు. ‘మొజ్తబా బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకూ ఆయన్ను ఎవరూ చూపించలేదు. ఆయన బతికి లేరని నేను వింటున్నాను. ఒకవేళ బతికే ఉంటే.. తన దేశం కోసం ఆయన ఒక తెలివైన పని చేయాలి. అదే లొంగిపోవడం’’ అని ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రభుత్వ చానల్‌ మాత్రం ఆయన గాయపడ్డారని, కానీ బతికే ఉన్నారని చెబుతోంది. ఆయన్ను.. ‘జాన్‌బాజ్‌ ఆఫ్‌ రమదాన్‌ వార్‌ (రమదాన్‌ యుద్ధంలో గాయపడ్డ వీరుడు’గా అభివర్ణిస్తోంది. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కుమారుడు యూసెఫ్‌ కూడా.. ఆయన గాయపడ్డారుగానీ, సురక్షితంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అని టెలిగ్రామ్‌ చానల్‌ ద్వారా తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తండ్రి ఖమేనీ మరణానంతరం మొజ్తబా రక్షణ కోసం ‘నోపో’ అనే అత్యంత అధునాతనమైన కౌంటర్‌ టెర్రరిజం యూనిట్‌ను నియోగించారు. ఈ యూనిట్‌ను 1991లో ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని కౌంటర్‌ టెర్రరిజం గ్రూపులకు ఇచ్చే అత్యంత అధునాతన, కఠినమైన శిక్షణనే వీరికి కూడా ఇస్తారు. నాయకత్వాన్ని కాపాడడంతోపాటు.. అంతర్యుద్ధాలను అణచివేయడంలోనూ వీరు చాలా క్రూరంగా వ్యవహరిస్తారనే పేరుంది. అలాంటి నోపో ఫోర్స్‌ రక్షణలోనే ప్రస్తుతం ఖమేనీ ఉన్నారని ఇరాన్‌ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 16 , 2026 | 03:46 AM