Share News

మొజ్తాబాకు రష్యాలో చికిత్స?

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:03 AM

ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం ప్రారంభించిన తొలిరోజు నుంచీ జాడ లేని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పరిస్థితిపై రోజుకొక కథనం వెలువడుతోంది.

మొజ్తాబాకు రష్యాలో చికిత్స?

వాషింగ్టన్‌, మార్చి 17: ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం ప్రారంభించిన తొలిరోజు నుంచీ జాడ లేని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పరిస్థితిపై రోజుకొక కథనం వెలువడుతోంది. మొజ్తాబా గుర్తుపట్టలేని విధంగా తీవ్రంగా గాయపడ్డారని ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. లేదు....తమ నేత క్షేమంగానే ఉన్నారని ఇరాన్‌ చెబుతోంది. అయితే, తొలిరోజు దాడిలో మొజ్తాబా తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైత్‌ నుంచి వెలువడే దినపత్రిక ‘అల్‌ జరిడా’ ఒక కథనం వెలువరించింది. మాస్కోలో అధ్యక్షుడు పుతిన్‌ సొంత పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతున్నదని తెలిపింది. ఈ కథనాన్ని అనుసరించి.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా జరిపిన తొలిరోజు దాడిలో సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ, ఆయన భార్యతోపాటు, ఆయన కుమారుడు మొజ్తాబా కుటుంబమంతా తుడిచిపెట్టుకుపోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మొజ్తాబా కోమాలోకి వెళ్లిపోయారు. రష్యాకు తీసుకువస్తే తానే దగ్గర ఉండి వైద్యం చేయిస్తానని పుతిన్‌ ఫోన్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌కు హామీ ఇచ్చారు. దీంతో మొజ్తాబాను ఈ నెల రెండో తేదీన మిలిటరీ విమానంలో అత్యంత రహస్యంగా మాస్కోకు తరలించారు. మాస్కోలో పుతిన్‌ గృహ సముదాయాల్లో ఒకదానిని ఆస్పత్రిగా మార్చి, ఆయనను అక్కడ ఉంచారు. అక్కడ ప్రత్యేక వైద్యుల సమక్షంలో మొజ్తాబాకు మేజర్‌ సర్జరీ జరిగింది. రెండు కారణాల వల్ల ఆయనను రష్యాకు తరలించాల్సి వచ్చింది. ఇరాన్‌లోనే ఉంటే మొజ్తాబా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఏ క్షణాన్నైనా మరో దాడి చేసే అవకాశం ఉంటుంది. స్వదేశంలో వైద్యం అందిస్తే.. వైద్యుల్లో ఎవరైనా ఆ సమాచారం లీక్‌ చేసే ప్రమాదం ఉంటుందని ఇరాన్‌ పాలకులు భయపట్టారు. కాగా, ‘అల్‌ జరిడా’ కథనంపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. ఈ కథనాన్ని రష్యాలో ఇరాన్‌ రాయబారి కాజెమ్‌ జలాలీ ఖండించారు.

Updated Date - Mar 18 , 2026 | 04:03 AM