Share News

కోమాలో మొజ్తాబా ఖమేనీ?

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:51 AM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.

కోమాలో మొజ్తాబా ఖమేనీ?

  • తీవ్ర విషమంగా ఆరోగ్య పరిస్థితి

  • నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో సుప్రీం లీడర్‌

  • ఖోమ్‌లోని ఆస్పత్రిలో చికిత్స

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన ఇరాన్‌ నగరం ఖోమ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా వర్గాల సమాచారం మేరకు, టైమ్స్‌ పత్రిక కథనం ప్రకారం 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. పాలనా పరంగా ఆయన ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేరు. ఫిబ్రవరి 28న ఆయతొల్లా అలీ ఖమేనీపై దాడి జరిగిన సమయంలోనే మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీనివల్ల ఆయన దేశాన్ని ముందుకు నడిపే పరిస్థితుల్లో లేరు. ఖోమ్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఎక్కడ ఉన్నారన్నది యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఎట్టకేలకు అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు మొజ్తాబా ఆచూకీ కనుగొన్నాయి. ఖోమ్‌ నగరం టెహ్రాన్‌కు దక్షిణంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షియా ముస్లింలకు ఈ నగరం చాలా పవిత్రమైనది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ మత రాజధానిగా ప్రసిద్ధికెక్కింది. యుద్ధం తొలిరోజునే మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని ఇరాన్‌ కూడా ధ్రువీకరించింది. దీనికి తోడు యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మొజ్తాబా బహిరంగంగా ఎక్కడా కనబడలేదు. ఆయన పేరుతో టీవీల్లో ప్రకటనలు మాత్రమే వెలువడ్డాయి. అయితే వార్‌ రూమ్‌లో ఇజ్రాయెల్‌లోని డిమోనా అణుశక్తి కేంద్రాన్ని మొబ్తాబా పరిశీలిస్తున్నట్లు ఉన్న ఏఐ వీడియోను ఇరాన్‌ ఇటీవల విడుదల చేసింది. ఆయనే తమ దేశానికి నాయకత్వం వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ పలు నివేదికలు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరోక్షంగా వెల్లడించాయి. ఖమేమీ కోమాలో ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గతంలో అమెరికా తెలిపింది. ఆయన కాలు విరిగిందని, ముఖంపై గాయాలయ్యాయని మరికొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

Updated Date - Apr 08 , 2026 | 03:51 AM