Share News

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తాబా ఖమేనీ

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:52 AM

ఇరాన్‌ అత్యున్నత నేత (సుప్రీం లీడర్‌)గా అయతుల్లా సయ్యద్‌ మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో మొజ్తాబాను ఇరాన్‌ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది.

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తాబా ఖమేనీ

  • ఎన్నుకున్న ఆ దేశ నిపుణుల అసెంబ్లీ.. విధేయత ప్రకటిస్తూ ప్రమాణం చేసిన అధ్యక్షుడు పెజెష్కియాన్‌, సైనికదళాలు

టెహ్రాన్‌, మార్చి 9: ఇరాన్‌ అత్యున్నత నేత (సుప్రీం లీడర్‌)గా అయతుల్లా సయ్యద్‌ మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో మొజ్తాబాను ఇరాన్‌ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. మొజ్తాబా.. అలీ ఖమేనీ రెండవ కుమారుడు. ఆయన వయసు 56 ఏళ్లు. ఈ మేరకు ఇరాన్‌ నిపుణుల అసెంబ్లీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైన తొలిరోజునే (ఫిబ్రవరి 28న) మరణించిన అలీ ఖమేనీకి అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. ‘అలీ ఖమేనీ అమరుడైన వెంటనే.. శత్రువుల బెదిరింపులు, యుద్ధ పరిస్థితుల మధ్య తదుపరి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను నిపుణుల అసెంబ్లీ ప్రారంభించింది. క్షుణ్ణంగా, విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం ఆదివారం సమావేశమైంది. సభ్యుల భారీ ఓటింగ్‌తో ఇస్లామిక్‌ విప్లవం మూడవ నాయకుడిగా మొజ్తాబా ఖమేనీని ఎన్నుకుంది’ అని నిపుణుల అసెంబ్లీ తెలిపింది. ఈ వివరాలను ఇరాన్‌కు చెందిన టాస్‌నిమ్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. 1979లో ఇరాన్‌లో ప్రారంభమైన ఇస్లామిక్‌ విప్లవానికి తొలి సుప్రీం లీడర్‌గా ఇమామ్‌ రుహొల్లా ఖొమేనీ పదేళ్లపాటు వ్యవహరించగా.. 1989లో ఆయన మరణానంతరం అయతుల్లా అలీ ఖమేనీ పగ్గాలు చేపట్టారు. 37 ఏళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు.

అధ్యక్షుడి విధేయతా ప్రమాణం

కొత్త సుప్రీం నాయకుడిగా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీకి ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ విధేయత ప్రకటిస్తూ ప్రమాణం చేశారు. ఇరాన్‌ విప్లవాన్ని దశాబ్దాలపాటు కాపాడి దేశ భవిష్యత్తుకు గట్టి పునాది వేసిన అలీ ఖమేనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఇరాన్‌ను శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత బలంగా మార్చి సమగ్రాభివృద్ధి పథంలో మొజ్తాబా తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మొజ్తాబా ఖమేనీకి విధేయత ప్రకటిస్తూ ఐఆర్‌జీసీ, రక్షణశాఖ, రక్షణమండలి, కుద్స్‌ ఫోర్స్‌, ఇతర సైనిక దళాలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశాయి. ఇరాన్‌ సైనికదళాల్లో అత్యున్నత విభాగంగా పరిగణించే ఐఆర్‌జీసీ సుప్రీం లీడర్‌కు మాత్రమే రిపోర్ట్‌ చేస్తుంటుంది.


తండ్రిని మించిన సంప్రదాయవాది

1980-88 మధ్య కాలంలో జరిగిన ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో మొజ్తాబా ఖమేనీ కొంతకాలంపాటు సైనికుడిగా పని చేశారు. ఆ తర్వాత మత బోధకుడిగా సేవలందించారు. 1989లో అలీ ఖమేనీ దేశ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తదనంతర కాలంలో.. తండ్రి కార్యాలయంలో కీలక వ్యక్తిగా మొజ్తాబా మారారు. ప్రభుత్వంలో ఏ పదవినీ ఆయన చేపట్టలేదు. సుప్రీం లీడర్‌కు జవాబుదారీగా ఉండే ఐఆర్‌జీసీతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకున్నారు. నిఘా వ్యవస్థలు, ప్రభుత్వ మీడియా సంస్థల మీద కూడా ఆయనకు గణనీయమైన ప్రభావం ఉన్నట్లు సమాచారం. విధానాల పరంగా అలీ ఖమేనీ.. సంప్రదాయవాదిగా ఉంటూనే సంస్కరణలకు కూడా చోటు కల్పించే వ్యక్తిగా ఉంటే.. మొజ్తాబా పూర్తిస్థాయి సంప్రదాయవాది అన్న అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మీద ఉక్కుపాదం మోపారన్న ఆరోపణలున్నాయి. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా అలీ ఖమేనీ గతంలో ఫత్వా జారీ చేశారు. దీనివల్లే ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేయలేదని, ఇప్పుడు మొజ్తాబా సారథ్యంలో అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ మారవచ్చంటున్నారు. కాగా, 1979 నాటి ఇరాన్‌ విప్లవం.. వంశపారంపర్య రాచరికానికి, నిరంకుశ అధికారానికి వ్యతిరేకంగా జరగగా.. ఇప్పుడు మళ్లీ సుప్రీం లీడర్‌ పదవి కూడా తండ్రి నుంచి కొడుక్కి సంక్రమించటంపై ఇరాన్‌లో అసమ్మతి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇరాన్‌ కొత్త సుప్రీంలీడర్‌కు..రష్యా, చైనా అండ!

ఇరాన్‌ సుప్రీంలీడర్‌గా ఎన్నికైన మొజ్తాబాకు రష్యా, చైనా పూర్తి మద్దతు ఇచ్చాయి. ఇరాన్‌ తమ విశ్వసనీయ భాగస్వామి అని, ఆ దేశానికి తమ సహకారం కొనసాగుతుందని సోమవారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. ముజ్తాబా ఖమేనీని అభినందిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సందేశం పంపారు. ‘‘సైనిక దాడులు కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో కీలక పదవిని చేపట్టడం ధైర్యం, నిబద్ధతతో కూడుకుని ఉంది’’ అని పుతిన్‌ పేర్కొన్నారు. ఇక ఇరాన్‌ కొత్త సుప్రీంలీడర్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని చైనా పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ ప్రకటించారు.

Updated Date - Mar 10 , 2026 | 04:52 AM