Share News

మానవత్వం బతకాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:09 AM

ఘర్షణలకు మానవత్వం బాధితురాలు కారాదని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యుద్ధం కారణంగా పూర్తిగా ధ్వంసమైన గాజాలో శాంతి ప్రణాళికకు భారత్‌ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు.

మానవత్వం బతకాలి

  • ఘర్షణలకు మానవత్వం బాధితురాలు కారాదు: మోదీ

  • ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు

జెరూసలేం, ఫిబ్రవరి 26: ఘర్షణలకు మానవత్వం బాధితురాలు కారాదని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యుద్ధం కారణంగా పూర్తిగా ధ్వంసమైన గాజాలో శాంతి ప్రణాళికకు భారత్‌ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు గురువారం ఆయ న ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చేవారిని కట్టడి చేసేందుకు తాము ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.

త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య త్వరలోనే పరస్పరం ప్రయోజనం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ‘రక్షణ రంగంలో కీలక హార్డ్‌వేర్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరిం త బలోపేతం చేసుకుంటాం. ఏఐ, వ్యవసాయం, సైబర్‌ స్పేస్‌, టెక్నాలజీ, వాణిజ్యం, డిజిటల్‌ పేమెం ట్స్‌, నీటి నిర్వహణ తదితర రంగాల్లో కలిసి పనిచేస్తాం. ఇజ్రాయెల్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌, క్రిటికల్‌ మినరల్స్‌ విభాగాల్లో సహకారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇజ్రాయెల్‌లో యూపీఐని వినియోగించేందుకు ఒప్పందం చేసుకున్నాం. ఇండియా-ఇజ్రాయెల్‌-యూఏఈ-యూఎ్‌సఏ (ఐ2యూ2) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఇండియా మిడిల్‌ ఈస్ట్‌ యూరప్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (ఐఎంఈసీ) ఏర్పాటుపైనా చర్చలు జరిపాం’ అని మోదీ వెల్లడించారు.


ఆరు విమాన ట్యాంకర్ల కొనుగోలు!

భారత వాయుసేన యుద్ధ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకొనేందు కోసం ఇజ్రాయెల్‌ నుంచి ఆరు విమాన ట్యాంకర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బోయింగ్‌ 767 ప్యాసింజర్‌ జెట్‌ సెకండ్‌ హ్యాండ్‌ విమానాలను ఆయిల్‌ ట్యాంకర్లుగా మార్చి అందజేసే ఈ డీల్‌ వి లువ రూ.8 వేల కోట్లు అని వెల్లడించాయి.

మోదీ ప్రసంగంపై నెతన్యాహు ప్రశంసలు

మోదీపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. నెస్సెట్‌లో మోదీ ప్రసంగం విని కళ్లు చెమర్చని వాళ్లు తమ దేశంలో లేరని తెలిపారు. ‘మీ పర్యటన అద్భుతం.. పర్యటన ముగింపు కూడా అద్భుతం’ అని కొనియాడారు. కాగా, ‘నేను సారాతో తొలిసారి డేట్‌కు వెళ్లింది టెల్‌ అవీవ్‌లోని భారతీయ రెస్టారెంట్‌కే. అక్కడ నేను రుచి చూసిన భారతీయ వంటకం అద్భుతంగా ఉంది’ అని నెతన్యాహు గుర్తు చేసుకున్నారు.

భారతీయంలో నెతన్యాహు

మోదీ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని భారతీయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. బుధవారం మోదీకి విందు ఇచ్చిన సమయంలో భారతీయ సంప్రదాయ వస్త్రాలు ధరించిన విషయాన్ని నెతన్యాహు గురువారం ఎక్స్‌లో వెల్లడించారు. ‘విందుకు ముందు నేను భారతీయ సంప్రదాయ వస్త్రాలు ధరించి నా మిత్రుడికి ఆశ్చర్యం కలిగించాను’ అని తెలిపారు. అందుకు మోదీ స్పందిస్తూ.. ‘అద్భుతం. మీరు భారతీయ వస్త్రధారణలో కనిపించటం.. మా సంస్కృతి, సంప్రదాయాలపై మీకున్న గౌరవానికి నిదర్శనం’ అని కొనియాడారు. కాగా, రెండు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ గురువారం రాత్రి తిరిగి భారత్‌కు చేరుకున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 04:09 AM