Share News

ఈ యుద్ధం మాకొద్దు

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:15 AM

అమెరికాలోని విదేశీయులను నిర్బంధంగా మెడలు పట్టి దేశం నుంచి గెంటి వేయటం, సొంత ప్రజలనే నడిరోడ్లపై కాల్చి చంపటం, తరచూ ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని లేనిపోని తలనొప్పులు తేవటం.....

ఈ యుద్ధం మాకొద్దు

  • ట్రంప్‌పై అమెరికా ప్రజల ఆగ్రహ జ్వాలలు

  • దేశమంతా ర్యాలీలు..పాల్గొన్న లక్షల మంది

  • ఉవ్వెత్తున ‘నో కింగ్స్‌’ ఉద్యమ కెరటం

వాషింగ్టన్‌, మార్చి29: అమెరికాలోని విదేశీయులను నిర్బంధంగా మెడలు పట్టి దేశం నుంచి గెంటి వేయటం, సొంత ప్రజలనే నడిరోడ్లపై కాల్చి చంపటం, తరచూ ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని లేనిపోని తలనొప్పులు తేవటం, అంతిమంగా ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టి ప్రపంచాన్నే సంక్షోభం అంచున నిలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సొంత దేశ ప్రజల నుంచే అసాధారణ నిరసన సెగలు తగులుతున్నాయి. ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ దేశ కాలమానం ప్రకారం శనివారం అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలతో కదం తొక్కారు. ఇరాన్‌తో యుద్ధాన్ని వెంటనే నిలిపేయాలని డివమాండ్‌ చేశారు. ‘నో కింగ్స్‌’ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒకేరోజు 3,200 నిరసన ర్యాలీలు జరిగాయని అమెరికా మీడియా పేర్కొంది.


చిన్న పట్టణాల్లోనూ భారీ ర్యాలీలు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్‌ ర్యాలీలు జరగటం ఇది మూడోసారి. గతంలో ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ ర్యాలీలు శనివారం మాత్రం చిన్న పట్టణాల్లో కూడా భారీగా కొనసాగాయి. దేశ రాజధాని వాషింగ్టన్‌తోపాటు న్యూయార్క్‌, డాలస్‌, ఫిలడెల్ఫియా, లాస్‌ ఏంజెల్స్‌ తదితర మహా నగరాల నుంచి మొదలుకొని.. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ ఉద్యమానికి మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్‌ పాల్‌ కేంద్రంగా మారింది. ఈ రాష్ట్రంలోనే ఇటీవల ఇమిగ్రేషన్‌ అధికారులు రెనీ గుడ్‌ అనే మహిళతోపాటు అలెక్స్‌ ప్రెట్టీ అనే వ్యక్తిని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. తాజా నిరసనల్లో ఉద్యమకారుల చేతుల్లో వీరి చిత్రాలు ప్రధానంగా కనిపించాయి. ట్రంప్‌తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు, సలహాదారులంతా నేరస్తులని, వారిని వెంటనే అరెస్టు చేయాలని పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నో కింగ్స్‌ ఉద్యమం యూరప్‌ ఖండానికి కూడా విస్తరించింది. లండన్‌, ప్యారిస్‌, రోమ్‌ తదితర నగరాల్లో ట్రంప్‌ విధానాలను నిరసిస్తూ శనివారం భారీ ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలో కొన్నిచోట్ల నిరసనల్లో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లోని ఫెడరల్‌ డిటెన్షన్‌ సెంటర్‌ వద్ద భద్రతా సిబ్బందిపైకి పలురువు నిరసనకారులు తమ చేతుల్లోని వస్తువులను విసిరారు. దీంతో వారిపై పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. డాల్‌సలో ట్రంప్‌ అనుకూల వర్గం నో కింగ్స్‌ ర్యాలీని అడ్డుకోవటంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మొత్తంగా దేశవ్యాప్తంగా శాంతియుతంగానే నిరసనలు కొనసాగాయి. ఈ ప్రదర్శనలు ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టాయని మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ అభివర్ణించగా, ఇవి రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకమని సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ విమర్శించారు. ఈ నిరసనల వెనుక ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ ఉందని రిపబ్లికన్‌ నేతలు ఆరోపించారు. కాగా, ఇమిగ్రేషన్‌ అధికారుల చేతిలో హత్యకు గురైన రెనీ గుడ్‌, అలెక్స్‌ ప్రెట్టీ జ్ఞాపకార్థం ప్రముఖ సంగీతకారుడు స్ర్పింగ్‌స్టీన్‌ రాసిన ‘స్ట్రీట్స్‌ ఆఫ్‌ మిన్నెపోలీస్‌’ గీతాన్ని శనివారం నిరసనల్లో ఆలపించి ఉద్యమకారులను ఆకట్టుకున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 04:15 AM