Share News

మెక్సికోలో మాఫియా డాన్‌ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:21 AM

మెక్సికోలో కరడు గట్టిన మాఫియా అధిపతి, ‘జలిస్కో న్యూ జెనరేషన్‌ కార్టెల్‌’ ముఠా నాయకుడు ఎల్‌ మెంచోను ఆ దేశ సైన్యం హతమార్చింది....

మెక్సికోలో మాఫియా డాన్‌ ఎన్‌కౌంటర్‌

  • ఎల్‌ మెంచోను హతమార్చిన సైన్యం.. సమాచారం అందించి సాయపడిన అమెరికా

  • దేశంలో ఎల్‌ మెంచో అనుచరుల విధ్వంసం

  • హింసలో 25 మంది నేషనల్‌ గార్డ్స్‌ మృతి

  • 30 మంది మాఫియా సభ్యుల హతం

మెక్సికో సిటీ, ఫిబ్రవరి 23: మెక్సికోలో కరడు గట్టిన మాఫియా అధిపతి, ‘జలిస్కో న్యూ జెనరేషన్‌ కార్టెల్‌’ ముఠా నాయకుడు ఎల్‌ మెంచోను ఆ దేశ సైన్యం హతమార్చింది. నేర ప్రపంచంపై మెక్సికో ఇటీవలి కాలంలో సాధించిన అతిపెద్ద విజయంగా విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు. జలిస్కో రాష్ట్రంలోని తపల్పా అనే ప్రాంతంలో ఉన్న ఎల్‌ మెంచోను అరెస్టు చేయటానికి ఆదివారం చేపట్టిన ఆపరేషన్‌లో అతనికి తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స కోసం రాజధాని మెక్సికో సిటీకి హెలికాప్టర్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడని మెక్సికో రక్షణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఎల్‌ మెంచోతోపాటు మరో ఇద్దరు గాయాలపాలై మరణించారని, ఇద్దరు అరెస్టయ్యారని తెలిపింది. ఎల్‌ మెంచో ముఠాకు చెందిన సాయుధ వాహనాలను, రాకెట్‌ లాంచర్లను, భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ముగ్గురు సైనికులు కూడా గాయపడి, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా, మెక్సికో స్పెషల్‌ ఫోర్సెస్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌కు తాము నిఘా సమాచారం అందించామని మెక్సికోలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు, వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లెవిట్‌ తెలిపింది. ‘అమెరికాలోకి ఫెంటనైల్‌ను భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్న ఎల్‌ మెంచో మెక్సికో, అమెరికా ప్రభుత్వాల టాప్‌ టార్గెట్‌గా ఉన్నాడు’ అని కరోలిన్‌ పేర్కొన్నారు. మరోవైపు, ఎల్‌ మెంచో హతమయ్యాడని తెలిసి ‘జలిస్కో న్యూ జెనరేషన్‌ కార్టెల్‌’ ముఠా సభ్యులు మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించారు. అనేక చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను, దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను, పెట్రోల్‌బంకులను తగలబెట్టారు. ‘జలిస్కో న్యూ జెనరేషన్‌ కార్టెల్‌’ సభ్యుల హింసాకాండను అడ్డుకునే ప్రయత్నాల్లో సైన్యం చేతిలో దాదాపు 30 మంది హతమయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో దాదాపు 25 మంది నేషనల్‌ గార్డ్స్‌ కూడా మరణించినట్లు సమాచారం.


17 ఏళ్లుగా నేర సామ్రాజ్యం

ఎల్‌ మెంచో పూర్తి పేరు నెమెసియో ఒసెగురా కార్వంటిస్‌. 2009లో జలిస్కో రాష్ట్రం కేంద్రంగా ‘జలిస్కో న్యూ జెనరేషన్‌ కార్టెల్‌’ ముఠాను ఏర్పాటు చేశాడు. ఫెంటనైల్‌, మెతామెఫ్టమైన్‌, కొకైన్‌ వంటి పలు రకాల మాదక ద్రవ్యాలను అమెరికాకు భారీ ఎత్తున అక్రమంగా రవాణా చేసేవాడు. కిరాయి హంతకుల్ని పెద్ద సంఖ్యలో చేర్చుకొని ముఠాను దేశంలో వేగంగా విస్తరింపజేశాడు. తనకు ఎదురు తిరిగిన ప్రభుత్వ అధికారుల్ని హత్య చేయించేవాడు. చివరికి ఈ ముఠా.. మెక్సికో ప్రభుత్వానికే సవాల్‌గా మారి, సైన్యంపైనా దాడులు చేసే స్థాయికి చేరుకుంది. సైన్యానికి చెందిన హెలికాప్టర్లపైనా దాడి చేసి కూల్చివేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ‘జలిస్కో న్యూ జెనరేషన్‌ కార్టెల్‌’ ముఠాను అమెరికా ఉగ్రవాదసంస్థగా ప్రకటించింది. ఎల్‌ మెంచోను పట్టుకోవటానికి అవసరమైన సమాచారం ఇచ్చిన వారికి 1.5 కోట్ల డాలర్ల (రూ.136 కోట్లు) బహుమానం ఇస్తామని పేర్కొంది. ఎల్‌ మెంచే హతంతో ఇతర మాఫియా ముఠాలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాగా, మెక్సికోలో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తమను సంప్రదించాలని అక్కడి భారత ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Feb 24 , 2026 | 04:21 AM